తాడిపత్రి టెన్షన్.. రంజుగా రాజకీయం
posted on Mar 17, 2021 @ 1:04PM
గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్ ఎన్నిక. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటు తిరస్కరణ. టీడీపీ క్యాంప్ పాలిటిక్స్, అధికార వైసీపీ బెదిరింపు రాజకీయాలతో ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిలర్లు చేజారకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రహస్య శిబిరం నిర్వహిస్తున్నారు. టీడీపీ క్యాంపులో సైకిల్ గుర్తుపై గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్ ఉన్నారు. ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామనే స్పష్టమైన హామీ ఇచ్చి శిబిరంలో కొనసాగుతున్నారు. 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ప్రతిపాదించే ఛైర్మన్ అభ్యర్థికే తాము మద్దతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్ సమర్పించారు. మొత్తం 36 స్థానాలున్న తాడిపత్రి పురపాలికలో టీడీపీ నుంచి 18 మంది, వైసీపీ తరఫున 16 మంది కౌన్సిలర్లు గెలవగా.. ఒకటి సీపీఐ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీకి ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ బలం 18కి చేరింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటును అధికారులు తిరష్కరించడంతో లెక్క సరిసమానమైంది. అయితే, సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు టీడీపీకి మద్దతు ప్రకటించి క్యాంపులో చేరడంతో తాడిపత్రి రాజకీయం రంజుగా మారింది.
మరోవైపు.. టీడీపీ సభ్యులపై అధికార పార్టీ నుంచి ఒత్తిడి, బెదిరింపులు పెరిగాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ టీడీపీ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం టాటా మోటార్స్ గ్యారేజ్‌కి వెళ్లి వైసీపీకి మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ నేత హాజీ వలికి వైసీపీ నేత కాకర్ల రంగనాథ్ అల్టిమేటం జారీ చేశారు. అధికారపార్టీ నేతల మాట వినకపోవడంతో టాటా మోటార్స్ షో రూమ్ నిర్వాహకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న రహస్య శిబిరం విజయవంతంగా కొనసాగుతుండటం.. బెదిరింపులకు బెదరకుండా అంతా టీడీపీకి కట్టుబడి ఉండటంతో అధికార పార్టీ నేతల్లో అసహనం పెరుగుతోంది. ఛైర్మన్ ఎంపిక ముగిసేదాకా తాడిపత్రిలో హైటెన్షన్ కంటిన్యూ కానుంది.