పాపం ఏపీ.. కేంద్రానికే రూ 1200 కోట్లు బాకీ
posted on Mar 17, 2021 @ 3:36PM
ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్ములను రాష్ట్రాలకు ఇస్తుంది. జిఎస్టి అమలులోకి వచ్చిన తరువాత ఈ పన్నులన్నీ కేంద్ర ప్రభుత్వానికే పోతున్నాయి. ఆలా వచ్చిన సొమ్ముల నుండి కేంద్రమే ఆయా రాష్ట్రాలకు వారికీ చెందాల్సిన వాటాను ఇస్తుంది.
రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ఏపీకి చెందిన వైసిపి ఎంపీలు లోక్ సభలో ప్రశ్నించగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వారికి షాక్ ఇచ్చే సంగతి చెప్పారు.ఇంతకూ రైల్వే మంత్రి ఎం చెప్పారంటే.. ఏపీనే కేంద్రానికి రూ. పన్నెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని.. దయచేసి మీ పరపతిని ఉపయోగించి వాటిని కేంద్రానికి ఇప్పించేందుకు చొరవ తీసుకోవాలని అయన వైసీపీ ఎంపీలను కోరారు. అయితే కేంద్ర మంత్రి విజ్ఞప్తితో వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా బిత్తరపోగా ఇతర రాష్ట్రాల ఎంపీలు ఒక్కసారిగా ఎపి పరిస్థితిపై నవ్వుకున్నారు .
పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్‌పై చర్చ జరిగింది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతున్న సమయంలో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల అంశంపై వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ . కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని మొత్తకున్నారు. అయితే ఎంపీలు ప్రస్తావించిన ప్రాజెక్టులన్నీ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రాజెక్టులేనని . గుర్తు చేసిన గోయల్, ఇలా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ సర్కార్, రైల్వేలకు రూ. 1200 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. మీ పలుకుబడిని ఉపయోగించి ఈ మొత్తాన్ని రైల్వేలకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అయన వైసిపి ఎంపిలను కోరారు. దీంతో పాపం వైసీపీ ఎంపీలకు నోట మాట రాక అవాక్కయ్యారు.
ఏపీలోని జగన్ సర్కార్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్న కారణంగా.. గతంలో జరిగిన పలు పనులకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన బిల్లులన్నిటిని పెండింగ్‌లో పెట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏకంగా రైల్వేకు చెల్లించాల్సిన నిధులను కూడా పెండింగ్ లో పెట్టిందని ఇంతవరకు ఎక్కడా బయట పడలేదు. తాజాగా ఇప్పుడు రైల్వే మంత్రి బయటపెట్టిన విషయంతో లోక్ సభ సాక్షిగా వైసిపి ప్రభుత్వం నవ్వులపాలైంది
రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రైల్వే శాఖ రాష్ట్ర ప్రభత్వాలతో కలిసి కొత్త లైనలను అలాగే అదనపు సౌకర్యాలను కల్పిస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిధులూ ఇవ్వకపోవటంతో ఆ పనులన్నీ ఎక్కడైకక్కడ నిలిచిపోయాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికే పట్టనపుడు ఇక తాము మాత్రం చేయగలిగిందేమీ లేదని కేంద్రం కూడా పక్కన పెట్టేస్తోంది. దీంతో ఏపీలో జరగాల్సిన రైల్వే అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.