అంత వీజీ కాదు.. ఆ లెక్కే వేరప్పా...
posted on Mar 17, 2021 @ 11:57AM
తిరుపతి ఉపపోరు. నెల రోజులే గడువు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం. తిరుపతిలోనూ అదే రిపీట్ అవుతుందా? మళ్లీ అధికార పార్టీదే విజయమా? పైపైన చూస్తే అలానే అనిపించినా.. లెక్కలు పక్కాగా వేస్తే.. వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ వైసీపీ ఖాతాలోనే ఉన్నా.. విజయం దక్కాలంటే చెమటోడ్చాల్సిందే అంటున్నారు. అందుకు వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అధికార బలం, ప్రభుత్వ పథకాలు ఇవి మాత్రమే వైసీపీకి అనుకూలం. ఫిజియోథెరపిస్టు గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు స్థానికంగా పెద్దగా ప్రాచుర్యం ఏమీ లేదు. ప్రజలకు చేసిన సేవ కూడా ఏమీ లేదు. ఉన్న అర్హతల్లా జగన్ రెడ్డికి ఫిజియోథెరపీ చేయడం మాత్రమే. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన పాదయాత్రలో ఆయనకు ఫిజియోథెరపీ సేవలు అందించారు గురుమూర్తి. అందుకు ప్రతిఫలంగా అతనికి తిరుపతి ఎంపీ అభ్యర్థిత్వం వరించింది. అంతేగానీ, అతనికి రాజకీయ అనుభవమో.. ప్రజల్లో ఆదరణో అసలేమాత్రం లేదు. ఇదే అతని మైనస్.
ఇక టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీలో నిలిచారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆమె సొంతం. తిరుపతిలో మంచి పాపులారిటీ, ఖ్యాతి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో దెబ్బ తిన్న పులిలా ఉన్న టీడీపీ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఎలక్షన్‌ను సవాల్‌గా తీసుకుంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కూడా కావడం ప్రతిపక్ష పార్టీకి అనుకూలమే.
ఇక కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ రేసులో ఉండటంతో టఫ్ కాంపిటీషన్ తప్పకపోవచ్చు. ఇక బీజేపీ, జనసేన పొత్తు తిరుపతి పొలిటికల్ ఈక్వేషన్‌ను అమాంతం మార్చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక నగరం కావడం, మొదటి నుంచి బీజేపీ ఉనికి చాటుకుంటుండటం, పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటం.. ఆ పార్టీకి అదనపు బలం. బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం.. ఆయనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్.. ఇలా బీజేపీ, జనసేన పొత్తు అధికార పార్టీ ఓట్లను డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరి తిరుపతి ఎంపీ ఎలక్షన్లో వైసీపీకి వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు. నయానో, భయానో స్థానిక సంస్థలను కొల్లగొట్టింది అధికార పార్టీ. పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చిన్న ప్రాంతానికే పరిమితమవడం.. స్థానికంగా అంత బలంగా ఉండని అభ్యర్థులపై అధికారాన్ని ప్రయోగించి ఈజీగా లొంగ దీసుకోవడం.. ప్రభుత్వ పథకాలు, పనులు కావంటూ బెదిరించడం.. కేసులంటూ భయపెట్టడం.. లాంటి చర్యలతో స్థానిక సంస్థలను అధికార పార్టీ కైవసం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ సీటు కోసం జరిగే ఎన్నికలో ఇలాంటి బెదిరింపులు, మేనేజ్ చేయడాలు కుదరవు. పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి పెద్దదిగా ఉండటం.. పార్టీ తరఫున ఒకే అభ్యర్థి ఉండటం.. స్థానిక అంశాలకంటే విధాన పరమైన, పార్టీ పరమైన ప్రాధాన్యత వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం.. తదితర కారణాలతో తిరుపతి ఎలక్షన్ అధికార పార్టీకి నల్లేరు మీద నడక కాకపోవచ్చు. టీడీపీకి ఇంకా విస్తృత స్థాయి ప్రజాభిమానం ఉండటం.. చంద్రబాబు సొంత జిల్లా కావడం.. బీజేపీ, జనసేన పొత్తు.. కాంగ్రెస్ పట్టు.. ఇలా అనేక కారణాలతో తిరుపతి సీటు అన్ని పార్టీలకు సవాల్‌గా మారనుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య చీలిపోయే ప్రమాదం మాత్రం లేకపోలేదు.