అయ్యో నారాయణ.. కాంగ్రెస్ మొండి చేయి..
posted on Mar 17, 2021 @ 1:07PM
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారయణ స్వామికి, అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. వరసపెట్టి ఒకరొకరు రాజీనామా చేశారు. అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గి ప్రభుత్వం మైనారిటీలో పడి పోయింది. చివరకు అసెంబ్లీలో బల పరీక్ష కంటే ముందే ఆయన రాజీనామా చేశారు. అందుకోసమే ఎదురుచూస్తున్నకేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. నిజానికి కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులకు బీజేపీనే పుణ్యం కట్టుకుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం చొరవతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు.ఇదేమీ రహస్యం కాదు. బహింరంగ రహస్యం.
అదలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరకు సహచర మంత్రులు రాజీనామా చేయడం, సభలో బలం నిరుపించుకోలేక వెనుతిరగవలసి రావడం, సీనియర్ కాంగ్రెస్ నేత, నారయణ స్వామిని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. రాజీనామ చేసిన అనతరం ఆయన పదవి పోయినందుకు తనకు పెద్దగా బాధ లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అవమానం మాత్రం తనను బాధిస్తోందని వాపోయారు.
ఇప్పుడు ఆ గాయం పూర్తిగా మానక ముందే,ఆయనకు మరో అవమానం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం’ ఆయనకు ఈ ఎన్నికలలో పోటీచేసే అవకాశం కూడా లేకుండా చేసింది. టికెట్ నిరాకరించింది. మొత్తం 30 మంది సభ్యులున్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరగ నున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్ధుల తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, నారాయణ స్వామి పేరు లేదు.
నారాయణ స్వామి ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన ఏఐసీసీ ఇంచార్జి దినేష్ గుండు రావ్’ చెప్పేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి పోటీ చేయడం లేదు. పార్టీ ఎన్నికల బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తారు’ అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుందా లేదా అనేది తెలియక పోయినా, నారాయణ స్వామి పరిస్థితి, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉందని, సుదీర్ఘ కాలం పాటు, పార్టీకి సేవ చేసిన సీనియర్ నాయకుని ఇలా అవమాన పరచడం ఏమిటని ఆయన అనుచరులు ‘పాపం పెద్దాయన ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. నిట్టూరుస్తున్నారు.