కరోనాతో ఎంపీ, ఆయన ఇద్దరు కుమారులు మృతి
posted on May 21, 2021 9:16AM
దేశంలో కరోనా మహమ్మారికి లక్షలాది మందిని బలైపోతున్నారు. పేద, దనిక తేడా లేకుండా అంతా వైరస్ సోకి చనిపోతున్నారు. కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే.. డాక్టర్లు ఏమి చేయలేకపోతున్నారు. వందల కోట్ల ఆస్తిపరులు, రాజకీయ నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒడిషాలో ఒక ఎంపీ కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. ఎంపీతో పాటు ఆయన ఇద్దరు కుమారులను వైరస్ బలి తీసుకుంది.
ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర (78) కూడా కరోనాతో చనిపోయారు. ఆయన ఇద్దరు కుమారులు కూడా కొన్నిరోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. మహాపాత్ర ఈ నెల 9న మరణించారు. గత నెల 22న ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకోలేకపోయారు.ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్ కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత బుధవరం కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత గురువారం తుదిశ్వాస విడిచాడు.
రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.