ఎమ్మెల్యే తిట్ల దండకం.. అభినందించిన సీఎం జగన్!
posted on May 20, 2021 @ 4:54PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ప్రతిపక్ష టీడీపీ సభను బహిష్కరించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఇంకేం సభా వేదికగా కొందరు ఎమ్మెల్యేలు నోటికి పని చెప్పారు. సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహించారు. సభలోని లేని వ్యక్తులను టార్గెట్ చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదు సీఎం జగన్. వారించాల్సింది పోయి.. తిట్ల దండకం చేసిన ఓ ఎమ్మెల్యేను ఓపెన్ గానే అభినందించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సీఎం స్పందన చూసిన వారంతా షాకవుతున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఉన్నారు. రఘురామ రాజును కొన్ని రోజులుగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలోనూ అదే కంటిన్యూ చేశారు. బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ నిర్వహించగా... గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై మాట్లాడకుండా ఎంపీ రఘురామపై మాటల దాడికి దిగారు వైసీపీ సభ్యులు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం వేరే సభలో సభ్యుడిగా ఉన్న గురించి మాట్లాడటానికి వీలు లేదు. కాని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం లోక్ సభ సభ్యుడిగా ఉన్న రఘురామ కృష్ణం రాజును తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎంపీ రఘురామపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తు, నాయకుడి ఫోటోతో రఘురామ గెలిచారని.. ఆయన రాజీనామా చేస్తే వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేరని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన.. వేరే సభలో సభ్యుడి గురించి ఈ అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని.. తాను మాట్లాడినదాంట్లో తప్పుంటే ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను జోగి రమేష్ కోరారు. సభా రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడానని ఎమ్మెల్యే జోగి రమేషే అంగీకరించినా.. సీఎం జగన్ అతన్ని అభినందించి మరీ దారుణంగా వ్యవహరించారు. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జోగి రమేష్‌కు థాంక్యూ చెప్పాలంటూ ఆయన్ను అభినందించాలన్నారు. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని జగన్ అన్నారు.
అసెంబ్లీలో లోక్ సభ సభ్యుడి గురించి మాట్లాడటం రూల్స్ కు విరుద్ధం. ఎమ్మెల్యే తిట్ల దండకం కూడా విరుద్ధమే. రెండు రూల్స్ ను అతిక్రమించిన ఎమ్మెల్యేను మందలించకుండా సీఎం జగన్ అభినందించడం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. స్వార్ధ రాజకీయాలతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటంపై టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
మరోవైపు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగా మంత్రి గుర్తు చేశారు. ఈ తీర్మానం అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.