కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్స్.. అందరూ పాటించాల్సిందే..
posted on May 20, 2021 @ 3:13PM
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని అందరూ పాటించాలని.. అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలమని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కమిటి స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ కన్నా భయంకరంగా ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. గాలి ద్వారా కూడా సంక్రమిస్తోందని శాస్త్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వాడడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్ కూడా బాగా ఉండేలా చూసుకోవాలని, రెండు మాస్క్‌లు ధరిస్తే ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కోవిడ్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా రోగులు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు... నోటి నుంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఈ తుంపర్లతో రెండు రకాలు ఉంటాయి. పెద్ద తుంపర్లు (సూక్ష్మ బిందువులు) నేరుగా కిందపడతాయి. అవి 2 మీ. వరకు వ్యాపిస్తాయి. ఈ బిందువులు పడిన ప్రాంతాలను ముట్టుకొని.. అదే చేతులతో ముఖం, నోటిని తాకితే కరోనా సంక్రమిస్తుంది. అందుకే ఇంటి లోపల ఫ్లోర్‌ను, తలుపు హ్యాండిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతులను సబ్బులు, శానిటైజర్లతో క్లీన్ చేసుకోవాలి.
చిన్న చిన్న గాలి తుంపర్లతో ఎక్కువ ప్రమాదం ఉంది. అవి గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. కిటికీలు, తలుపులు మూసిఉండే గదుల్లో ఇవి ఎక్కువ సేపు ఉంటాయి. సరైన వెంటిలేషన్ ఉంటే వీటి నుంచి బయటపడవచ్చు. గాలి, వెలుతురు బాగా ఉండాలి. ఇళ్లు, ఆఫీసుల్లో కిటికీలు, తలులు తెరిచి ఉంచడంతో పాటు ఫ్యాన్స్ వేసుకోవాలి. కార్యాలయాల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుంటే మరీ మంచిది.
భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి. కరోనా సెకండ్ వేవ్‌లో రెండు మాస్కులు ధరించడం మంచింది. సర్జికల్ మాస్క్‌పైన కాటన్ మాస్క్ పెట్టుకోవడం శ్రేయస్కరం. సర్జికల్ మాస్క్ ఒక్కటే వాడితే.. ఒకసారి మాత్రమే వినియోగించాలి. కాటన్ మాస్క్‌తో కలిపి వాడితే ఐదుసార్లు వరకు ధరించవచ్చు. మాస్క్‌లను ఉతికిన ప్రతిసారీ ఎండలో ఆరబెట్టుకోవాలి.
ఈసారి నగరాలే కాదు పల్లెటూర్లకు కూడా వైరస్ విస్తరించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో కరోనా టెస్ట్‌ల సంఖ్యను మరింతగా పెంచాలి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడంలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవవాలి. కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు పెద్దగా లేకున్నప్పటికీ.. వారిని హోంఐసోలేషన్‌లో ఉండాలి. వారు బయట తిరిగితే వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదముంది.