నెల్లూరులో కరోనా మందు.. ఆనందయ్య మెడిసిన్‌పై ప్రయోగాలు.. రిపోర్టులో ఏముంది?
posted on May 20, 2021 @ 2:28PM
ప్రకృతిలో అన్నిరోగాలకు మందు ఉంది. కరోనాను సైతం ఆయుర్వేద మెడిసిన్‌తో ఖతం చేయొచ్చు. జిల్లేడు, మారేడు, నేరేడు.. ఇలా కొన్ని మూలికలను తేనేలో మరిగించి.. బాధితుడికి వేస్తే వైరస్ చనిపోతుంది. కొవిడ్ తగ్గిపోతుంది. డౌట్ ఉంటే మీరూ వాడి చూడండి తెలుస్తోంది అంటున్నారు. అందుకే, ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు కోసం జనాలు తెగ ఎగబడుతున్నారు. ముందు పదుల సంఖ్యలో మొదలైంది. ఆ తర్వాత రోజుకు 5-6వేల మంది వస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి ఆయుర్వేద మందు స్వీకరిస్తున్నారు. కరోనా మెడిసిన్‌తో కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా నివారణ కేంద్రంగా మారింది.
బొనిగే ఆనందయ్య. ఇతనే ఆ కరోనా మందుకు పితామహుడు. గొలగమూడి వెంకయ్య స్వామి భక్తుడు. కరోనా మొదటివేవ్ సమయంలో తమిళనాడుకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడి సూచనల మేరకు మందు తయారు చేసి తనపైనే ప్రయోగం చేసుకున్నాడట. ఆ మందు ప్రభావంతో కొవిడ్ తగ్గిపోవడంతో.. తర్వాత తమ కుటుంబ సభ్యులపై ప్రయోగించాడు. వాళ్లకూ ఉపశమనం లభించింది. దీంతో రెండో వేవ్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయర్వేద మూలికల్లో కాస్త మార్పులు చేసి మొత్తం 5 రకాల మందులు తయారు చేశాడు. ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాడు.
ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న ఆయర్వేద మందు మనచుట్టూ లభించే మూలికలతో తయారయ్యేదే. పటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనెతోపాటు మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 30 వేల మందికి ఉచితంగా ఈ మందును పంపిణీ చేశారు.
కృష్ణ పట్నం గ్రామ జనాభా సుమారు 11 వేలుంటుంది. వీళ్లంతా మందు తీసుకున్నారు. ఒక్కరికీ కరోనా సోకలేదు. ఈపాటికే పాజిటివ్ లక్షణాలు ఉన్నవాళ్లు మందుతో వేగంగా కోలుకున్నారు. ఆ విషయం ఆనోటా ఈనోటా అందరికీ తెలిసి.. కృష్ణపట్నం పేరు చుట్టు పక్కల ప్రాంతాల్లో మారిమోగిపోతోంది. ఉచితంగా ఇచ్చే మందు కోసం కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గ్రామానికి తరలి వస్తున్నారు. ఆనందయ్య ఇంటిముందు క్యూ లైను పెరుగుతోంది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ.. సీరియస్‌గా ఉన్న రోగులకు.. రహస్యంగా ఆ ఆయుర్వేద మందు ఇస్తున్నారంటే.. ఆనందయ్య ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
అయితే, ఎటువంటి అనుమతుల్లేకుండా, అర్హత లేనివ్యక్తి ఆయుర్వేదం పేరుతో మందులు పంపిణీ చేస్తున్నారని కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారితో పాటు మరో ముగ్గురు ఆయుర్వేద వైద్యులను బృందంగా నియమించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆ బృందం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టింది. ఆయుష్‌శాఖ వైద్యులతో ఆనందయ్య ఇస్తున్న మందును పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబొరేటరీకి పంపారు. మందు తీసుకున్న కరోనా బాధితులను వాకబు చేశారు. ఎవరికీ ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించారు. పైగా తమకు కరోనా నుంచి ఉపశమనం లభించినట్లు బాధితులు తెలిపారు. ఓ కరోనా బాధితుడి కంట్లో ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేద మందు వేయగా.. గంట వ్యవధిలోనే అతని ఆక్సిజన్ లెవెల్స్ 83 నుంచి 95కి పెరగడం అధికారులనే ఆశ్చర్యపరిచింది.
ఆ మందు తీసుకున్న వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులు రాలేదు. కానీ కంట్లో వేస్తోన్న మందు వల్ల దీర్ఘకాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ బృందం తమ ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు అందించింది. దాని ఆధారంగా లోకాయుక్తకు, ఆయుష్ కమిషనర్‌కు ప్రత్యేక నివేదిక తయారు చేసి పంపారు. మందులో వాడుతున్న మూలికల వివరాలన్నింటినీ రాష్ట్ర ఆయుర్వేద ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను అందజేస్తామని లోకాయుక్తకు కలెక్టర్ నివేదించారు.
అయినా సరే జనం భౌతిక దూరం పాటించడం లేదంటూ ఆనందయ్య ఇస్తున్న ఉచిత ఆయుర్వేద మందును బలవంతంగా నిలిపేయించారు. మందుపై పరీక్ష ఫలితాలు వచ్చే దాకా పంపిణీ చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు.
అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదే మందును ఏ పతంజలి కంపెనీనో తయారు చేసి ఉంటే ఇలానే అడ్డుకునే వారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆవు పేడ, గోమూత్రం కంటే.. ఆనందయ్య ఆయుర్వేద మందే సో బెటర్ అని వాదిస్తున్నారు. మరి, ఆనందయ్య మందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కళ్ల ముందే ఫలితాలు కనిపిస్తున్నా.. మందును అడ్డుకుంటారా? చూడాలి...