బీహార్ లో కొత్త వైరస్.. ఇదీ యమ డేంజరట!
posted on May 20, 2021 @ 9:26PM
దేశంలో ఇప్పటికే కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి సోకిన జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే వెలుగులోకి వచ్చిన బ్లాక్ ఫంగస్ కూడా వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి.మహారాష్ట్రలో 1,500 మంది దాని బారిన పడగా.. 90 మంది చనిపోయారు. దాని మరణాల రేటు 50 శాతంగా ఉంది. బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు అంటువ్యాధిగా ప్రకటించాయి. చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
కొవిడ్ వైరస్, బ్లాక్ ఫంగస్ భయం ఉండగానే తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ... వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే వీరికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.వైద్యులు చెపుతున్న దాని ప్రకారం వైట్ ఫంగస్ కన్నా బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకారి. వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్ఆర్సీటీ ద్వారా ఈ ఫంగస్ ను గుర్తించవచ్చు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు హెచ్ఆర్‌సీటీలో కనిపిస్తే, వైట్ ఫంగస్‌ను కనుగొనడానికి మ్యూకస్ (శ్లేష్మం) కల్చర్‌ను ఎగ్జామిన్ చేయాలి. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది.
మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. దానిని ఎపిడెమిక్ గా గుర్తించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద దానిని ‘ప్రమాదకరమైన జబ్బు’గా గుర్తించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స, నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలిన ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదేశించారు. తాజా ఆదేశాలతో ప్రతి బ్లాక్ ఫంగస్ కేసునూ జిల్లాల అధికారులు ఆరోగ్య శాఖకు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆరోగ్య శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది.