అసెంబ్లీలోనూ కులం కంపేనా! రాష్ట్రం పరువు పోతున్నా జగన్ మారరా?
posted on May 20, 2021 @ 6:59PM
దేశమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్ని వైరస్ పై వార్ చేస్తున్నాయి. కొవిడ్ కంట్రోల్ కోసం లాక్ డౌన్ అమలు చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ఏపీలోను కొవిడ్ విలయ తాండవం చేస్తోంది. పాజిటివిటి రేటు ప్రమాదకరంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి కూడా ఉంది. రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కొవిడ్ భయంతో ఏపీ జనాలు వణికిపోతున్నా జగన్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పై ఫోకస్ చేస్తే.. ఏపీలో మాత్రం కక్ష రాజకీయాలు, కులం కంపే ప్రాధాన్యతగా ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీలో వరుసగా జరుగుతున్న అరెస్టులు, కొవిడ్ వ్యాక్సిన్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలానే ఉంటున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే మీడియా సమావేశంలో కులాల ప్రస్తావన తేవడం దుమారం రేపింది.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ సంస్థపై జగన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. వ్యాక్సిన్లకు కులం లింక్ కలపడంపై తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన తీరు మారలేదు. ఈసారి అసెంబ్లీ వేదికగా మళ్లీ ఆవే వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన జగన్.. విపక్ష తెలుగుదేశం పార్టీపైనా, కొన్ని మీడియా సంస్థలపైనా విమర్శలు చేశారు. వ్యాక్సిన్ అంశంపై కొందరు పదేపదే వక్రీకరిస్తున్నారని, తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారని జగన్ అన్నారు. దేశంలో18 ఏండ్ల పైబడిన వారందరికి రెండు డోసులు ఇవ్వాలంటే 170 కోట్ల డోసులు కావాలని చెప్పారు జగన్. అయితే మనదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కేవలం 7 కోట్ల డోసులేనని.. వీటిలో 6 కోట్ల డోసులు సీరమ్ సంస్థ, 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్నాయని తెలిపారు. దేశానికి 172 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగింది 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు.
ఇక ఏపీలో 7 కోట్ల డోసులు అవసరం ఉందన్నారు జగన్ . కానీ కేంద్రం ఇప్పటివరకు 76 లక్షల 29 వేల 580 డోసులే ఇచ్చిందని చెప్పారు.వాస్తవాలు ఇలావుంటే... కొందరు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఆరోపణలు చేసేవారందరికీ ఈ పరిస్థితులు తెలుసన్నారు. ఈ ఆరోపణలనే ఈనాడులో రామోజీరావు గారు రాస్తుంటారు. ఇదే రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే ఈ భారత్ బయోటెక్. చంద్రబాబునాయుడికీ బంధువులు. మరి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలుసు కదా అధ్యక్షా అంటూ జగన్ ప్రసంగించారు. తెలిసి కూడా... వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు పెట్టి వ్యాక్సిన్లు ఎందుకు కొనడంలేదు? కమీషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడంలేదని అంటున్నారు. కొవిడ్ సమయంలో ఈ దుర్మార్గపు ఆరోపణలు, వక్రీకరణలు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతుందన్నారు జగన్.
కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ఎంపీ కృష్ణా ఎల్లాకు కులం లింక్ కలుపుతూ గతంలో సీఎం జగన్ మాట్లాడారు. ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు సమీప బంధువులు అని చెప్పారు. ఇక్కడ మరో అక్రమ సంబంధమూ అంటగట్టారు సీఎం గారు. రామోజీరావుకు చంద్రబాబుకు మధ్య ఎలాంటి బంధుత్వం లేదనేది జగమెరిగిన విషయమే. అయినా.. జగన్‌రెడ్డి వారిద్దరికీ బలవంతంగా బంధం కలిపేశారు. కొవాగ్జిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ యజమాని.. రామోజీరావు కొడుకు వియ్యంకుడు కాబట్టి.. ఆయన చంద్రబాబుకూ బంధువే అవుతారట. అదెలాంటి చుట్టరికమో ఆయనకే తెలియాలి. కొవాగ్జిన్ కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా.. ఆ ముగ్గురు కమ్మ కులస్తులు కాబట్టే.. ఏపీకి వ్యాక్సిన్ ఇవ్వటం లేదనే సంకేతం ఇచ్చేలా కూతలు కూశారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు. తాజాగా మరోసారి అసెంబ్లీ వేదికగా ఆవే మాటలు మాట్లాడారు. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.