సీబీఐ విచారణ జరిపించండి.. రఘురామ కేసులో మరో పిటిషన్
posted on May 21, 2021 9:16AM
నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ రఘురామ కృష్ణం రాజు కేసులో శుక్రవారం కీలక విచారణ జరగనుంది. గతంలో రఘురామ వేసిన బెయిల్ పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరపనుంది. ఈకేసులోనే సుప్రీకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు రఘురామ తనయుడు భరత్. తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి (ఎస్‌హెచ్‌వో), సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ పాల్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
‘2004-09 మధ్యకాలంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ‘క్విడ్ ప్రొ కొ’ పద్ధతిలో అవినీతికి పాల్పడినందున 11 కేసుల్లో సీబీఐ జగన్‌ను నిందితుడిగా చేర్చింది. ఆయనపై మనీలాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి. 16 నెలలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం జగన్ తన సహనిందితులకు ఉన్నత స్థానాలు కల్పించి సాక్షులను దారికి తెచ్చుకోవడానికి భయోత్పాతం సృష్టిస్తున్నారు. దాంతో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నా తండ్రి రఘురామరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి రోజూ ఫోన్లు, సామాజిక మీడియా ద్వారా ఆయనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు’ అని తన పిటిషన్ లో భరత్ తెలిపారు.
ఈ నెల 14న ఉదయం 9 గంటలకు రఘురామరాజుపై కేసు నమోదుచేయించి.. 40 మంది పోలీసులను గుంటూరు నుంచి హైదరాబాద్ పంపించి.. మధ్యాహ్నం 3.30కి అరెస్టు చేయించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గైనకాలజిస్టు. ఇది అప్పుడు మా న్యాయవాదులకు, గౌరవ హైకోర్టుకు తెలియదు. పైగా ఆమె భర్త వైసీపీ లీగల్ సెల్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు’ అని తన పిటిషన్ లో పొందు పరిచారు భరత్.
సీఎం జగన్ చెప్పినట్లు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ నడుచుకుంటున్నారని భరత్ తన పిటిషన్‌లో తెలిపారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఆయన చెప్పుచేతల్లో ఉందన్నారు. సీఐడీ ఏడీజీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చినవారిని ఎంచుకుని సీఐడీలో కీలక పోస్టుల్లో నియమించుకున్నారు. వీరిలో సీఐడీ అదనపు ఎస్పీ, నా తండ్రి కేసు దర్యాప్తు అధికారి విజయపాల్ కూడా ఒకరు. నిరుడు డిసెంబరు 29న విజయనగరం జిల్లా రామతీర్థంలో వెయ్యేళ్లనాటి శ్రీరామచంద్రుడి విగ్రహం తలనరికేశారు. దీనిపై హిందూ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. దీంతో ఈ సంఘటనపై సునీల్‌కుమార్ నేతృత్వంలో జగన్ సీఐడీ విచారణకు ఆదేశించారు. వీరిద్దరూ ఒకే మతానికి చెందినవారు. దీనిపై రఘురామరాజు ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. అలాగే సునీల్‌కుమార్ ఏసుక్రీస్తును, బ్రిటిష్ పాలకులను పొగడుతూ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. సునీల్‌కుమార్‌కు, ఆయన భార్యకు వైవాహిక జీవితంలో సమస్యలున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను తమకు అందించాలని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదిక ఇప్పటికే కోర్టుకు చేరింది. మరోవైపు బెయిలు కోసం రఘురామ పెట్టుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌కు కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది. గురువారం జరిగిన విచారణలో రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రఘురామ రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇప్పటికే వై సెక్యూరిటీని కూడా పొందారని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. రఘురామ పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నేటి వరకు వాయిదా కోరింది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది.