తండ్రిని చంపిన కొడుకు..
posted on May 21, 2021 @ 11:48AM
యముడు సిగ్నల్ ఇస్తే.. ఎవడైనా యమలోకానికి వేలాల్సిందే.. పెద్దల సామెతలో చెప్పాలంటే ఈ భూమి మీద నూకలు చెల్లితే ఏ మనిషైన బకెట్ తన్నాల్సిందే.. కానీ ఈ రెండు కాకుండానే కొత్త కన్నా వాళ్లే తల్లిదండ్రులను ఖతం చేస్తున్నారు. ఏమోక్షన్స్ నేటి సినిమాలో అయినా ఉన్నాయేమోగాని జనాలకు మాత్రం ఎలాంటి ఎమోషన్స్ లేవు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రోజు జరిగే క్రైమ్ అలా ఉంది. అనవసరంగా ఒక మనిషిని చంపితే ఆ చంపినా వాడి లెక్క ఆ దేవుడు అనేవాడు ఉంటే ఆయనే చూసుకుంటాడు.. తప్పుచేసిన వాడి లెక్కలు ఆయనే తెలుస్తాడు.. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. మీరే చూడండి..
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనికరం లేకుండా కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన జిల్లాలోని సంతమాగులూరు మండలం సజ్జాపురంలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున కోడలు, కొడుకు కలసి తండ్రిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు, కోడలు పరారీలో ఉన్నట్టు సమాచారం.
కరోనా ఏమోగాని.. కరోనా ఆత్మహత్య ఎక్కువ..
ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ.. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మరోవైపు వైరస్ భయానికి పలువురు పేషెంట్లు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మరింత కలచివేస్తున్నాయి. ఇటువంటి విషాద ఘటన కృష్ణా జిల్లాలోని పెడనలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్, భారతి భార్యా భర్తలు. వీరికిద్దరు పిల్లలు. 10 రోజుల క్రితం ఈ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో హోంఐసోలేషన్‌లో ఉంటున్న దంపతులు.. వైరస్ ఎంతకీ తగ్గడం లేదన్న మనస్థాపంతో ఉరివేసుకున్నారు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు చివరకు అనాథలుగా మిగలడం బాధాకరం.
మూడు రోజుల్లో పెళ్లి కరోనా తో వరుడు మృతి..
మరో మూడు రోజుల్లో పెళ్లి భాజాలు మోగుతాయనుకున్న ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాలూరు మండలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుకుట్టి గ్రామంలోని ఓ బ్యాంకులో బ్యాంకుమిత్రగా పనిచేస్తున్న చిన్నపాత్రుని మనోహర్(22)కు ఈ నెల 23న వివాహం జరగనుంది. 21న ముహూర్తపు రాట వేసేందుకు పెద్దలు ఏర్పాట్లు చేశారు. 13న ఆయనకు జ్వరం రావడంతో తోణాం పీహెచ్‌సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటానని మనోహర్ చెప్పినా, ఆక్సిజన్ శాతం తగ్గడంతో ఆయనను వైద్యాధికారిణి సుజాత బొబ్బిలికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఆయన జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారం నుంచి అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆసుపత్రిపై నుండి పడి మరొకరు మృతి..
కరోనా సోకిన భార్యను ఆసుపత్రిలో చేర్పించి ప్రమాదవశాత్తు అదే ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి పడి భర్త దుర్మరణం చెందిన ఘటన మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్ సమీప మిందిలో నివాసముంటున్న మల్లప్పరెడ్డి మురళీకృష్ణ (48) డాబాగార్డెన్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. భార్య గీతారాణి (45)కి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఈనెల 18న కేజీహెచ్ సమీపంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు సపర్యలు చేస్తున్నారు. ఈనెల 19న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ మూడో అంతస్తు బాల్కనీ వద్ద నిల్చొని మాట్లాడుకుంటుండగా ప్రమాదవశాత్తు మురళీకృష్ణ కింద పడి దుర్మరణం చెందారు. వీరికి పాప, బాబు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో వీరిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. బంధువులే దగ్గరుండి అంత్యక్రియలకు సహకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.