జిల్లాకో ఆక్సిజన్ ప్లాంట్.. సోనుసూద్ బాటలో చిరంజీవి
posted on May 20, 2021 @ 6:59PM
కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు సోనుసూద్. సూద్ ఫౌండేషన్ నుంచి దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ప్రస్తుతం సోనుసూద్ దేవుడిలా కనిపిస్తున్నారు. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఆపదలో ఉన్న వారికి నేనున్నాంటూ ఆదుకుంటున్నారు. అందుకే ప్రస్తుత కొవిడ్ కాలంతో.. కష్టం వస్తే ప్రభుత్వాల వైపు చూడట లేదు.. పాలకులను వేడుకోవడం లేదు.. సోనుసూద్‌నే తలుచుకుంటున్నారు. సోను సేవలతో టాలీవుడ్ హీరోల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సోనుసూద్ ప్రభావమో, తమపై వస్తున్న విమర్శలే కారణం తెలియదు కాని.. టాలీవుడ్ హీరోలు కూదా కోవిడ్ కోసం కదలివస్తున్నారు. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల తిరుపతి రుయాలో కూడా ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్ మానిటర్ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్ ఖాతాను కూడా ప్రారంభించారు.
చిరంజీవి ఇప్పటికే ప్రజాసేవలో ఉన్నారు. ఎవరూ రక్తం దొరకని సరిస్థితిలో ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మృతి చెందాడు. చాలాకాలంగా తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ మరణించడంతో చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు.