ముక్కు నేలకు రాస్తారా? కుట్రలకు భయపడేదే లే..
posted on May 30, 2021 @ 11:00AM
సీఎం కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమవుతోంది మాజీ మంత్రి ఈటల కుటుంబం. అక్రమ కేసులు, అసత్య ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈటల సతీమణి జమున పేరుతో కొనుగోలు చేసిన భూములను.. కబ్జా భూములంటూ ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే రాజ్యం బనాయించిన కేసులపై ఈటల రాజేందర్ ఇటు ప్రజాక్షేత్రంలో.. అటు హైకోర్టులో.. పోరాడుతున్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి కాబట్టి.. బలమైన జాతీయ పార్టీలో చేరేందుకూ సిద్ధమవుతున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు.. ఇటు పింక్ మీడియా కలిసి.. ఈటల అక్రమాలకు పాల్పడ్డారంటూ దుమ్మెత్తిపోస్తుండటంపై.. ఈటల ఫ్యామిలీ భగ్గుమంది. తాజాగా, ఈటల సతీమణి జమున కేసీఆర్‌పై, అధికారులపై డైరెక్ట్‌గా మాటల యుద్ధానికి దిగారు. బస్తీమే సవాల్ అన్నట్టు మాట్లాడారు.
‘‘మెదక్ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా?’’ అంటూ సవాల్ విసిరారు ఈటల జమున.
తమ హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. తాము కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు. మాసాయిపేటలో మోడ్రన్ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
1992లో దేవరయాంజల్ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదంటూ భగ్గుమన్నారు ఈటల రాజేందర్ సతీమణి జమున.
పనిలో పనిగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పత్రికపైనా ఫైర్ అయ్యారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా? మా స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే మాపై దుష్ప్రచారం చేస్తారా? అంటూ నిలదీశారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని ఈటల భార్య జమున ఆవేశంగా మాట్లాడారు.
ముక్కు నేలకు రాస్తారా? అంటూ నేరుగా అధికారులను.. మా భూమిలో పెట్టిన పత్రిక అంటూ పరోక్షంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఇక తగ్గేదే లే.. తాడోపేడో తేల్చుకునుడే.. అన్నట్టుగా ఈటల జమున సంకేతాలు ఇచ్చారు.