తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపే?
posted on May 30, 2021 @ 10:17AM
తెలంగాణలో లాక్ డౌన్ ను సడలిస్తారా.. పొడిగిస్తారా? సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. మొదట మే 20 వరకు ప్రకటించారు. తర్వాత 30వ తేదీ వరకు పొడిగించారు. ఆదివారంతో అ గడువు ముగియనుండటంతో లాక్ డౌన్ పై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తూ... తర్వాత లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే విధంగా మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలుపై రాష్ట్రమంత్రివర్గం భేటీలో చర్చించనున్నారు. జూన్ నెలాఖరు వరకు కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం నిర్ణం తీసుకుంది. దీంతో తెలంగాణలోనూ లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ తోనే కరోనా నియంత్రణ పటిష్టంగా జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కేబినెట్ సమావేశానికి హోంశాఖ, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మాట్లాడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరోనా కట్టడికి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్‌ఫంగస్ చికిత్సపై సమావేశంలో చర్చించనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది. చాలా రాష్ట్రాలు జూన్ 15 వరకు పొడిగించాయి. తెలంగాణ పక్క రాష్ట్రాలైనా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోనూ లాక్ డౌన్, కర్ఫ్యూ అమలవుతోంది. పక్క రాష్ట్రాల్నని లాక్ డౌన్ లో ఉన్నందున... ఇక్కడ కూడా లాక్ డౌన్ పెట్టడం తప్పనిసరని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో 600 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు సంబంధించిన ఫైలును మంత్రివర్గం ఆమోదించనున్నది. వైద్యసిబ్బంది నియామకం, జ్వరసర్వే, వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లపై చర్చించనున్నారు. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్ల ప్రక్రియలో ప్రీబిడ్డింగ్ సమావేశం కూడా పూర్తయ్యింది. కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.
వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామని చెప్పడంతో.. దానిపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.