రెండేళ్ల అరాచకం.. మరో మూడేళ్లు భరించాల్సిందేనా?
posted on May 30, 2021 @ 12:29PM
జగన్‌రెడ్డి గద్దె నెక్కి సరిగ్గా రెండేళ్లు. మిగిలింది మరో మూడేళ్లు. ఈ రెండేళ్లలోనే రచ్చ రంబోలా చేశాడు. వామ్మో.. ఇంకో మూడేళ్లు భరించాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు. జగన్ అన్నా.. ఆయన పాలనన్నా.. జనాలు అంతగా భయపడుతున్నారు. ఈ రెండేళ్లలో జగన్ ఏం సాధించారో చెప్పడం కష్టమే కానీ.. జగన్ ఏం నాశనం చేశారో చెప్పడం మాత్రం చాలా సులువు. పాలనను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పడానికి అనేక ఉదాహరణలు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఈ ప్రశ్న ఏ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో అడిగినా టక్కుమని సమాధానం చెప్పలేని పరిస్థితి? దేశంలోకే కఠినమైన ప్రశ్న ఇది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని.. ఆంధ్రులంతా సగర్వంగా.. చాతి విరుచుకు మరీ చెప్పుకునే వారు. మా రాజధాని.. సింగపూర్ తరహాలో ఉంటుందని.. మాది అంతర్జాతీయ స్థాయి రాజధాని అని.. మా రాజధానికి దేశంలో మరే ప్రాంతం సాటికాదని.. ఇలా ఆంధ్రులంతా గొప్పలు పోయేవారు. సీమ ప్రజలు సైతం అమరావతిని అదృష్టంగా భావించారు. ఉత్తరాంధ్ర వాసులు సైతం మా అమరావతి అని మురిసిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అందలమెక్కిన జగనన్న.. ఒక్క మాటతో అమరావతిని మూడు ముక్కలు చేశాడు. ఆ ముక్కలనైనా చక్కగా చేశాడా? అంటే అదీ లేదు. కర్నూలు అలానే కునారిల్లుతోంది. తమ ప్రాంతానాకి న్యాయం జరగడం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. జగన్‌రెడ్డి తీరును చూసి విశాఖ విస్తుబోతోంది. సముద్రతీరంలో జరుగుతున్న భూదందాలతో బెదిరిపోతోంది. జగన్‌రెడ్డి రెండేళ్ల పాలన ఎంత అరాచకంగా సాగిందో చెప్పడానికి.. అమరావతినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు.
500 రోజులకు పైబడి అమరావతి రైతులు దీక్షలు చేస్తున్నా.. ఈ సర్కారులో ఉలుకూపలుకూ లేకుండా పోయింది. రైతుల చేతికి సంకెళ్లు వేసి అక్కసు తీర్చుకున్న ఘనత జగన్‌రెడ్డి పాలనదే అనే విమర్శ. అసైన్డ్ భూములంటూ.. ఏకంగా ప్రతిపక్ష నేతపైనే కేసుల కుట్ర చేస్తుండటం ఈ రెండేళ్ల పాలన ఫలితం.
నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా.. ఏపీపై చంద్రబాబు చేసిన అందమైన సంతకాన్ని.. విధ్వంసంతో చెరిపేసే ప్రయత్నం జరుగుతోందనేది అందరి అభిప్రాయం. చంద్రబాబు లక్ష్యంగానే జగన్ పాలన కొనసాగుతోందని అంటున్నారు. గద్దె నెక్కిన తొలినాళ్లలోనే.. 'ప్రజా వేదిక' కూల్చేసి.. ప్రతీకారం తీర్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఐఏఎస్, ఐపీఎస్‌ల సమావేశం పెట్టాలంటే.. ఏపీలో ఒక మంచి వేదికంటూ లేకుండా పోయింది. ప్రజా వేదిక కూలగొట్టి ఏం సాధించారో జగన్‌కే తెలియాలి అంటున్నారు. ఇక, అక్రమ నిర్మాణమంటూ చంద్రబాబు నివాసానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారో.. వారికే తెలీదు. మరి, ఈ రెండేళ్లలో కరకట్టపై అక్రమ నిర్మాణాల తొలగింపు ఎంత వరకు వచ్చింది ముఖ్యమంత్రి గారు?
మరింత దారుణమైన విషయం ఏంటంటే.. పేదల నోటి కాడి.. కూడు చెదరగొడుతూ.. అన్న క్యాంటీన్లను అర్థాంతరంగా మూసేయడం. ప్రభుత్వం మారింది.. పేదల నిత్యాన్నపథకం మూతబడింది. రాజన్న క్యాంటీన్లు పెడతామన్నారు.. రెండేళ్లు అవుతోంది ఏవి? పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి కూడా ఇంత రాజకీయం చేయాలా జగన్? అని కడుపు కాలుతున్న వాళ్లంతా కడుపుమంటతో నిలదీస్తున్నారు.
నవరత్నాల పాలనంటూ జగన్‌రెడ్డి ప్రభుత్వం మురిసిపోతోంది. ఆ నవరత్నాల వెనుక ఉన్న.. అప్పుల కుప్పల సంగతి సామాన్యులకు తెలీదని అనుకుంటోంది. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను.. అప్పులప్రదేశ్‌గా మార్చేశారు. ఇక అప్పు ముట్టడం కష్టమవుతుండటంతో.. ఏకంగా ప్రభుత్వ భూములను అడ్డంగా అమ్మేసుకునేందుకు తెగబడుతున్నారు. బంగారంలాంటి విశాఖ భూములను అంగట్లో వేలానికి పెట్టారు. అప్పులు, అమ్మేసుకోవడాలే.. రెండేళ్ల విశిష్టత.
ఇక, అభివృద్ధి అనే పదం ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందా? ఒక్కటంటే ఒక్క భారీ పెట్టుబడి అయినా ఏపీలో పెట్టారా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. కియాలాంటి ఎన్నో కంపెనీలు ఏపీకి క్యూ కడితే.. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక.. ఉన్న కంపెనీలే తట్టాబుట్టా సదురుకొని రాష్ట్రం నుంచి చెక్కేసే పరిస్థితి దాపురించిందని వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నా.. ఈ ముఖ్యమంత్రి చెవికి సోకితేగా? విశాఖ స్టీల్ ప్లాంట్ మనది కాకుండా పోతున్నా.. పట్టించుకుంటేగా?
ఇక, లిక్కర్, ఇసుక పాలసీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేశ ప్రజలకు తెలిసిన.. ఏ బ్రాండ్ మద్యం కూడా ఏపీలో అమ్మరు. మద్యం అమ్మకాలను ప్రభుత్వపరం చేసి.. ఊరూ-పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి.. భారీగా రేట్లు బాదేసి.. జనాలతో బలవంతంగా మందు తాగిస్తున్నారు. మద్యం మానలేక.. ఆ మందు గొంతు దిగక.. బుక్క బుక్కకీ.. జగన్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారు మందుబాబులు. వివిధ సంక్షేమ పథకాల పేరుతో మహిళలకు ఇస్తున్న డబ్బంతా.. ఆ ఇంటాయన తాగే మద్యం రూపంలో మళ్లీ ప్రభుత్వ ఖజానాకే చేరుతుందనేది జనం మాట. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి.. మరో చేత్తో వంద లాగేసుకుంటున్నారనే విమర్శ. ఆ మద్యం బ్రాండులతో జగన్‌రెడ్డి జేబులోకి వేల కోట్ల రూపాయలు కమిషన్‌గా వచ్చి పడుతోందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇక, ఉచిత ఇసుక హామీ ఎప్పుడు గంగలో కలిసిపోయింది. ఏపీలోని ఇసుక రీచులను వేలం పాటలో అయిన వారికి అమ్మేసుకున్నారు. ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నారు.
అభివృద్ధితో పాటు పాలన ఇలా పడకేస్తే.. కక్ష్య సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాల్లో మాత్రం ఈ రెండేళ్లలో జగన్‌రెడ్డి భారీ విజయమే సాధించారని చెప్పొచ్చు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మొదలు.. అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, కూన రవికుమార్.. ఇలా ఏ జిల్లాలో ఎవరినీ వదలకుండా.. కుట్రలు, కేసులతో ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రయత్నాల్లో ఈ రెండేళ్లూ బిజీగా ఉన్నారు సీఎం జగన్‌రెడ్డి. ఇందులో ఏ కేసులో బలం లేకుండా.. టీడీపీని భయ పెట్టడానికే ఇలా కేసులతో బెదిరిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. ప్రతిపక్షమనే కాదు.. స్వపక్షంలో విపక్షంగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామను ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతకంటే ఎక్కువే ఇబ్బంది పెట్టింది ఏపీ సర్కారు. ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలో గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని.. ఇది జగన్ పైశాచిక ఆనందానికి నిదర్శనమని.. ప్రతిపక్ష టీడీపీ ప్రతినిత్యం విమర్శిస్తూనే ఉంది.
కేవలం పార్టీలు, నేతలనే కాదు.. రాజ్యాంగ వ్యవస్థలనూ జగన్‌రెడ్డి వదలడం లేదంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు.. జగన్‌రెడ్డికి జరిగిన.. టామ్ అండ్ జెర్రీ వార్‌ను చూసి జనాలే చీదరించుకున్నారు. ఎన్నికలు వద్దంటూ.. జగన్ సర్కారు చేసిన కుట్రలు.. మధ్యలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. రమేశ్‌కుమార్‌ను తొలగించి.. జస్టిస్ కనకరాజ్‌ను ఎస్ఈసీగా చేసి.. కోర్టు మెట్టికాయలతో తలబొప్పికట్టి.. అబ్బో.. స్టేట్ వర్సెస్ ఎస్ఈసీ ఎపిసోడ్.. ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి అనుభవరాహిత్యానికి నిదర్శనం అంటున్నారు. ఇక, వరుసగా జరిగిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పక్షం చేసిన ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు పోటెత్తిన వైనం చూసి అంతా నివ్వెర్రపోయారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాలనే ఉన్నాయి జగన్‌రెడ్డి యవ్వారాలు. ఈ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఓ పీడకలగా మారిందంటున్నారు. జగన్‌రెడ్డి పాలనలో అభివృద్ధిలో ఏపీ రెండు దశాబ్దాలు వెనకబడిందని వాపోతున్నారు. అరాచకాల్లో మాత్రం అందనంత ఎత్తులో.. అందరికన్నా ముందున్నారని అంటున్నారు. ఇలాంటి అధ్వాహ్న, అడ్డగోలు పాలనను ఏపీ ప్రజలు మరో మూడేళ్లు భరించాలా? అని భయపడిపోతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై వేగంగా విచారణ జరుగుతుండటం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.. అప్పటి దాకా తప్పదు ఈ దారుణం అంటున్నారు. జగన్‌రెడ్డి రెండేళ్ల అరాచక పాలనపై ఓ పుస్తకం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.