తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 15 నుంచి డబ్బులు...
posted on May 29, 2021 @ 8:07PM
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామన్నారు. జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కాటగిరీ ల వారిగానే రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతువద్దనుంచి వొక్కగింజకూడా కొంటలేరని చెప్పారు కేసీఆర్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరన్నారు. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసిందని చెప్పారు కేసీఆర్. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. వొక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.
తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు. ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో.. ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిష్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసిందన్నారు.
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సిఎం కెసిఆర్ చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ అదికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.