దోచుకున్నది రాస్తే గ్రంథమే! జగన్ రెండేళ్ల పాలనపై టీడీపీ చార్జ్‌షీట్..
posted on May 30, 2021 @ 4:24PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం పుస్తకాన్ని ఆవిష్కించారు. వైసీపీ కౌంటర్ గా ఈ రెండేళ్లలో సీఎం చేసిన విధ్వంసంపై ‘జగన్ విధ్వంసం అనే చార్జ్‌షీట్’ పేరుతో టీడీపీ విడుదల చేసింది. విధ్వంస ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో కెక్కారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెండేళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా డమ్మీలేనని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీ, ఏసీబీ, పీసీబీ పాలనే సాగుతుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
జేసీబీతో కూల్చడం, ప్రశ్నించిన వారిపై ఏసీబీ కేసులు పెట్టడం, కుదరక పోతే పీసీబీని రంగంలోకి దింపుతున్నారన్నారు. సీఎం జగన్ ఏది చెప్తే సీఐడీ అదే చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం పతనమైపోతోందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ రెండేళ్ల పాలనపై వైసీపీ పుస్తకం తీసుకురావడంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేసిన దానికే పుస్తకం వేసుకుంటే, దోచుకున్న దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో అని అన్నారు. బ్లూ మీడియాను అడ్డుపెట్టుకుని మసిపూసి మారేడు కాయ చేయడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు అని విమర్శించారు. వైసీపీ చేసిన సంక్షేమం కంటే జరిగిన దోపిడీ పదింతలుంది అని రాజా ఆరోపించారు. చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఆస్తులు అమ్మడం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్ప జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ఎద్దేవా చేశారు.
తన రెండేళ్ల పాలనపై పుస్తకం రిలీజ్ చేసిన సీఎం జగన్.. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రతి ఒక్కరి సహాయంతో ఇవన్నీ చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు జమ చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా రూ. 36,197 కోట్లు ఇచ్చామన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించామని సీఎం జగన్ అన్నారు.