ఆలయంలో వైసీపీ కలర్స్.. అధికారుల ఓవరాక్షన్.. టెంపుల్ పాలిటిక్స్..
posted on May 30, 2021 @ 2:07PM
నీలం, తెలుపు, ఆకుపచ్చ.. ఈ మూడు వైసీపీ జెండా రంగులు. ఏపీని ఈ మూడు రంగుల్లో ముంచెత్తాలని గతంలో ప్రయత్నించారు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ షాపులు, ప్రభుత్వం అనే పేరున్న దేనికైనా.. ఈ మూడు రంగులనే పులిమేవారు. కోర్టు మొట్టికాయలతో ఈ మధ్య కాస్త కంట్రోల్ అయ్యారు.
తాజాగా, మరోసారి ఓవరాక్షన్ చేశారు అధికారులు. ఈసారి ఏకంగా గుళ్లోనే ఆ మూడు రంగులతో అలంకరణ చేసేశారు. దేవుడంటే భయంలేదో.. లేక, ముఖ్యమంత్రి అంటే భయమో తెలీదు కానీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను రాజకీయ కార్యక్రమంగా మార్చేశారంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ద్వారకా తిరుమలలో ఈ నెల 22 నుంచి 29 వరకు.. వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు జరిగాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. ఆ సందర్భంగా గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో భాగంగా.. వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం ప్రస్తుత వివాదానికి కేంద్రం.
గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడ దీయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డితో పాటు అధికారుల తీరుపై భక్తులు భక్తులు మండిపడుతున్నారు. దేవాలయంలో ఈ రాజకీయ రంగులు ఏంటంటూ తప్పుబడుతున్నారు. సహజమైన పూలతో అలంకరించకుండా.. కావాలని ఇలా వైసీపీ రంగులు ఉన్న ప్లాస్టిక్ పూలదండను తెప్పించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ పూలను పెట్టడం.. వెంకన్న స్వామి వైభవాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయినా.. మంచి పాలన అందిస్తే ప్రజల మన్ననలు పొందుతారు కానీ.. ఇలా రంగులను చూసి.. ఎవరబ్బా ఓట్లు వేసేది? ఇంత చిన్న లాజిక్ మరిచి.. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు.. దేవాదాయ శాఖ అధికారులు ఇలా ద్వారకా తిరుమలను రాజకీయ రంగుల క్షేత్రంగా మార్చడాన్ని భక్తులు చీదరించుకుంటున్నారు.