కొవిడ్ బాధితులకు కేంద్రం భరోసా
posted on May 30, 2021 @ 11:11AM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కొవిడ్’తో కన్నుమూసిన వారి కుటుంబాలను, కొవిడ్ కాటుకు తల్లి తడ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని, అనాధ పిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.అనాధ పిల్లలకు కేవలం తాత్కాలిక ఆర్థిక సహాయం చేయడం కాకుండా, వారి జీవితాలను తీర్చిదిద్దే విధంగా, ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అనాధ పిల్లలకు విద్యా బుద్ధులు అందించడంతో పాటుగా, వారికి 18 ఏళ్ల వయసు వచ్చే నాటికి, వారి పేరున రూ.పది లక్షల మూలనిధిని ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రన్’ ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే విధంగా చిన్నారులకు ఉన్నత విద్య కోసం రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీని పీఎం కేర్స్ చెల్లిస్తుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ), ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతగా పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎం కేర్స్ నిధి ద్వారా పెన్షన్ సదుపాయం కలిపిస్తుంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవస్థీకృత కార్మికులు, ఉద్యోగులకే కాకుండా అవ్యవస్తీకృత రంగంలో పనిచేసే కార్మికులు కొవిడ్’తో మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం సగటు రోజు కూలీలో 90 శాతం సొమ్మును పెన్షన్‌గా అందజేస్తారు. గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకం అనుసరించి ఇచ్చే గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. కనిష్ఠ బీమా కింద రూ.2.5 లక్షలను ఇచ్చే పథకాన్ని కూడా పునరుద్ధరించారు.. ఈ పథకం గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లపాటు వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది’’ అని ప్రభుత్వం వివరించింది.
ఇదిలా ఉంటే, మరోవంక కరోనా మహమ్మారి రెండోదశలో తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) రాష్ట్రాలను శనివారం కోరింది. ఆ సమాచారాన్ని ‘బాల్ స్వరాజ్ పోర్టల్’లో పొందుపరచాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖలు రాసింది. జువెనైల్ జస్టిస్ ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, వారి హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. అలాంటి చిన్నారులను బాలల సంక్షేమ కమిటీ ముందుకు తీసుకురావాలని తెలిపింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు 577 మంది బాలలు అనాథలైనట్లు ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అలాంటి చిన్నారుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లేఖలు రాసింది. దిల్లీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే చిన్నారుల కోసం ఉచిత విద్య, నెలవారీ భృతిని అందజేస్తూ అండగా నిలుస్తున్నాయి. పోషణ, సంరక్షణ అవసరమైన చిన్నారులను పర్యవేక్షించేందుకు బాల్ స్వరాజ్ పోర్టల్‌ను రూపొందించారు.