జగన్ రెడ్డికి తీన్మారేనా? రఫ్పాడిస్తున్న రఘురామ..
posted on Jun 5, 2021 @ 1:09PM
రఘురామ. వీడు మామూలోడు కాదురా బాబూ అని జగన్‌రెడ్డి తల పట్టుకుంటున్నారట. అనవసరంగా ఎందుకు పెట్టుకున్నామా అని తెగ బాధపడుతున్నారట.. రచ్చబండతో రాజీ పడితే.. ఢిల్లీ స్థాయిలో డ్యామేజీ జరిగేది కాదుగా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నారట.. వీడియోలతోనే వాడిని వదిలేస్తే.. పార్లమెంట్ స్థాయిలో పరువు పోయేది కాదుగా అని నిద్రలేని రాత్రులు గుడుపుతున్నారట. రఘురామ అనే పేరు వింటేనే.. జగన్‌రెడ్డి ఉలిక్కిపడుతున్నాడరట. ఎవరైనా కాంప్రమైజ్ చేస్తే బాగుండంటూ కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారట. ఇది కాస్త వెటకారమే అయినా.. రఘురామ కౌంటర్ అటాక్‌తో గొడ్డుకారం తిన్న వాడిలా తయారైంది జగన్‌రెడ్డి పరిస్థితి అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును మరి, రఘురామ ఎదురుదాడి మామూలుగా లేదు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ఎన్‌హెచ్ఆర్‌సీ.. ఇలా దేనినీ వదిలిపెట్టడం లేదు. తనకు జరిగిన దారుణంపై, తనపై జరిపిన థర్డ్ డిగ్రీ ప్రయోగంపై.. ఢిల్లీ స్థాయిలో జగన్‌రెడ్డితో చెడుగుడు ఆడుకుంటున్నారు. రఘురామ. ఇక తన అరెస్టులో పాత్రధారులు, సూత్రధారులైన ప్రతీ ఒక్కరినీ.. పేరు పేరుగా శిక్షిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి.. ఇలా ఏ ఒక్క రెడ్డినీ వదలడం లేదు రఘురామ. రాజు గారి దెబ్బకు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది చాలామందికి.
ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశామా! కస్టడీలో కుమ్మేశామా! జైల్లో పెట్టి మూసేశామా! అంతే. కట్టె.. కొట్టె.. తెచ్చె. ఇంతే సింపుల్ అనుకున్నారు. రఘురామ ఖేల్ ఖతం.. వీడియోల దుకాణం బంద్ అనుకున్నారు. కానీ, మొండిఘటం రఘురామ ఆ తర్వాత జగన్‌రెడ్డి సర్కారుకు చుక్కలు చూపిస్తారని ఆ సమయంలో వారికి తెలీదు. సుప్రీంకోర్టులో పోరాడి మరీ బెయిల్‌పై బయటకు వచ్చి.. ఢిల్లీ ఎగిరిపోయి.. ఇక అక్కడి నుంచి అసలైన ఆట మొదలుపెట్టారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. వీల్‌చెయిర్‌లో వెళ్లి మరీ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కలిశారు. సీఐడీ కస్టడీలో తనను కొట్టిన తీరును కళ్లకు కట్టినట్టు వివరించారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. కాలి గాయాలను చూపించారు. ఎంపీ అయిన తనపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు. జాతీయ మనవ హక్కుల సంఘాన్నీ ఆశ్రయించారు. తనను దారుణంగా కొట్టి.. మానవ హక్కులను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. ఇలా.. తనపై ఏపీ ప్రభుత్వం జరిపిన అమానుషంపై దేశ అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలన్నింటి దృష్టికీ తీసుకెళ్లారు రఘురామ. జగన్‌రెడ్డిని ఢిల్లీ స్థాయిలో దోషిగా నిలబెట్టారు.
అక్కడితో ఆగలేదు రఘురామ. పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తో పాటు.. వివిధ పార్టీలకు చెందిన సహచర పార్లమెంట్ సభ్యులకూ లేఖ రాశారు. తనను సీఐడీ కస్టడీలో ఎలా కొట్టింది.. తనపై రాజద్రోహం కేసు పెట్టి ఎలా హింసించిందీ.. అంతా పూసగుచ్చినట్టు వివరిస్తూ తోటి ఎంపీలకు లేఖ రాశారు. దెబ్బలతో కమిలిన తన కాలి గాయాల ఫోటోలనూ లేఖకు జత చేశారు. ఆ ఫోటోలు చేసి.. ఆ లేఖ చదివి.. సహచర పార్లమెంట్ సభ్యులు అవాక్కవుతున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఒక గౌరవ ఎంపీ పట్ల.. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులున్నాయని, వాటిలో జగన్ ఏ1 నిందితుడిగా ఉన్నారని, జగన్ తో పాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని.. సీఎం జగన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనను ఇలా హింసించారని లేఖలో వివరించారు రఘురామ. ఆయన రాసిన లేఖ, పంపిన ఫోటోలను.. తమ అధికారికి సోషల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేస్తున్నారు. రఘురామకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు పలువురు ఎంపీలు. రఘురామపై జగన్‌రెడ్డి సర్కారు చేసిన దారుణాలను ట్విట్టర్ వేదికగా దుయ్యబడుతున్నారు.
ఏపీలో హిట్లర్ రాజ్యమా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తానని, కానీ ఒక పార్లమెంటేరియన్ పట్ల ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి?ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమంటూ ట్వీట్ చేశారు మాణికం ఠాగూర్.
కర్ణాటకకు చెందిన ఎంపీ హేమలత అంబరీష్.. శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది.. ఇలా అనేక మంది ఏపీ ప్రభుత్వ తీరును సోషల్ మీడియాలో నిప్పులతో కడిగేస్తున్నారు.
అనేక మంది ఎంపీల పోస్టులతో.. ఈ రాష్ట్రం, ఆ పార్టీ అనే తేడా లేకుండా.. యావత్ దేశానికి ఇప్పుడు రఘురామ ఎపిసోడ్ చేరింది. దేశ ప్రజలందరి ముందు జగన్‌రెడ్డి ప్రభుత్వం దోషిగా నిలబడింది. ఒక ఎంపీని కొట్టిన వైనం.. ఆయన కాలికి అయిన గాయాల ఫోటోలు చూసి.. పార్లమెంట్ సభ్యులంతా ఉలిక్కిపడుతున్నారు. ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని.. జగన్‌రెడ్డి సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనే జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని శిక్షిస్తున్న ఎంపీలు.. రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో అసలైన శిక్ష విధించడానికి.. ఏపీ సర్కారును పార్లమెంట్ కోర్టులోకి లాగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తనకు న్యాయం చేయమంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు రఘురామ. మరోవైపు, ఎంపీలంతా ముక్తకంఠంతో రఘురామకు మద్దతు పలుకుతున్నారు. తాజా వ్యవహారంపై కేంద్రం సైతం ఆగ్రహంగా ఉంది. అటు, జాతీయ మానవ హక్కుల సంఘం సైతం విచారణ ప్రారంభించింది. వరుస పరిణామాలు చూస్తుంటే.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రఘురామపై జరిగిన దాడి వ్యవహారం ప్రధాన ఎజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. జగన్‌రెడ్డి సర్కారు పార్లమెంట్ కన్నెర్రకు గురికాక తప్పదు. వెయిటింగ్ ఇక్కడ అంటూ.. రఘురామ ఢిల్లీలో కూర్చొని.. తొడగొట్టి సవాల్ విసురుతుంటే.. ఏపీలో జగన్‌రెడ్డి సర్కారులో దడ మొదలైంది.