ఇద్దరు సీనియర్ IASల ఫైట్! రూ. 12 కోట్లు ఏమయ్యాయో.. ?
posted on Jun 5, 2021 @ 2:43PM
కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతోంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రాణాలకు తెగించి కరోనా కట్టడికి శ్రమిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు అధికారులు నీచంగా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో స్కాములకు తెగబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులే కాదు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా అత్యంత దిగజారి వ్యవహరిస్తున్నారు. తాజాగా కోవిడ్ కంట్రోల్ కోసం కేటాయించిన డబ్బుల విషయంలో ఇద్దరు ఐఏఎస్ లు మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపుతోంది.
కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య వివాదం రచ్చకెక్కింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్, డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనను రోహిణి సింధూరి వేధించారంటూ శిల్పా నాగ్ పదవికి..రాజీనామా చేయగా.. తానేమీ వేధించలేదని, ఆమె ఆరోపణలు నిరాధారమని రోహిణి కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య రగడకు 12 కోట్ల రూపాయలే కారణమని తెలుస్తోంది.
కొవిడ్ కంట్రోల్, చికిత్స కోసం గ్రామాలకు డాక్టర్ల మార్చ్ పేరిట కర్ణాటక సర్కార్ నిధులిస్తోంది. కొవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా రూ. 12 కోట్ల కార్పొరేట్ ఫండ్ ను మైసూర్ కార్పొరేషన్ కు కేటాయించింది. ఈ నిధుల గురించి తాను కమిషనర్ శిల్పా నాగ్ ను ప్రశ్నిస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతోందని రోహిణి ఆరోపించింది. ఈ సీఎస్ఆర్ నిధులను ఎలా ఖర్చు పెట్టారని అడిగితే ..ఒక రోజున ప్రజలకు 400 ఇన్ఫెక్షన్లు, మరో రోజున-40 ఇన్ఫెక్షన్లు సోకాయని చెబుతున్నారన్నారు.
జులై 1 నాటికి మైసూరును కొవిడ్ రహిత జిల్లాగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల తాము గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా వివరాలను తెలుసుకోదలిచామని రోహిణి చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీ రవికుమార్ దృష్టికి అన్ని అంశాలనూ తీసుకు వచ్చామని ఆమె చెప్పారు. తన అనుమతి లేకుండా శిల్పా నాగ్ ప్రెస్ మీట్ ఎలా పెట్టారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (రోహిణి సింధూరి) తన అధికారిక నివాసంలో రూ. 50 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం ఎలా నిర్మించారో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం రీజనల్ కమిషనర్ ని ఆదేశించింది.
మరోవైపు ఇద్దరు మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారుల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారుల మధ్య వివాదంపై మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ అసమర్థతని చూపుతోందని, ఇంతకీ రూ. 12 కోట్లు ఏమయ్యాయని అన్నారు.