కలిసిపోయిన రేవంత్, కోమటిరెడ్డి! కాంగ్రెస్ కథ మారినట్టేనా..
posted on Jun 4, 2021 @ 4:25PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రగతి భవన్ టార్గెట్ గా ఈటల చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారాయి.
ఈటల కమలం గూటికి చేరుతుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. విభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టి కాంగ్రెస్ నేతలప. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఈ బృందంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి క్లోజ్ మూవ్అయ్యారు. ఇద్దరు నేతలు రాజ్ భవన్ దగ్గర కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం చాలామంది నేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై మాట్లాడారు. త్వరలోనే కొత్త టీపీసీసీ చీప్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. తమలో ఎవరికి ఆ పదవి దక్కినా.. అంతా కలిసే పని చేస్తామని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
టీపీసీసీ చీఫ్ పదవి కోసం కొంత కాలంగా తీవ్ర పోటీ నెలకొంది. మరో వారం రోజుల్లో టీపీసీసీ ఎంపికపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ వంటి వాళ్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి ఈ పదవి ఇవ్వాలని భావిస్తే.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని అన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తాను టీపీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల వర్గపోరుతో ఈసారి పీసీసీ చీఫ్ ను ప్రకటిస్తారా లేద వాయిదా వేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
అయితే రాజ్ భవన్ లో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి తిరిగిన తీరు, తర్వాత వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలతో.. పీసీసీ విషయంలో ఆ ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారనే చర్చ జరుగుతోంది. ఎవరికి పదవి వచ్చినా కలిసి పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ దూకుడు పెంచినందున అంతా కలిసి పని చేసి వాళ్లకు చెక్ పెట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారట. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీజేపీ కంటే ముందుంటే.. అది తమకు లాభిస్తుందని, అధికారం ఈజీగానే వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారని సమాచారం. చూడాలి మరీ.. హస్తం నేతల మధ్య ఐక్యత ఎంతకాలం ఉంటుందో..