అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. 4 నెలల బాలుడు..
posted on Jun 5, 2021 @ 10:49AM
వాడికి ఏంట్రా వాడు ఫైనాన్స్ చేస్తాడు వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. ఫైనాన్స్ చేసేవాడు దగ్గర కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి అనే డైలాగ్ నిత్యం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఫైనాన్స్ అందరికి చేయాలనీ ఉంటుంది. ఫైనాన్స్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా డబ్బులు సంపాదించొచ్చు అనే ధీమా ఉంటుంది. ఈ ఫైనాన్స్ లో సంపాదించి కుబేరులు అయిన వాళ్ళు వున్నారు. అదే ఫైనాన్స్ చేసి అన్ని పోగొట్టుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫైనాన్స్ లో లాభాలే కాదు, నష్టాలు ఉంటాయి. సరైన మనీ మేనేజ్ మెంట్ లేకపోయినా, సరైన కస్టమర్లు లేకపోయినా ఇక అంతే దుకాణం ముయాల్సిందే. తాజాగా తీవ్రంగా నష్టపోయిన రామకృష్ణ భార్య అనూష సహా ఇద్దరు పిల్లలతో కలిసి బి.కోడేరు మండలంలోని సగిలేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓపెన్ చేస్తే.. అది కడప జిల్లా. బి.కోడూరు మండలం. సగిలేరు జలాశయంలో శుక్రవారం ఉదయం దంపతులు, ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించడంతో సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి, బి.కోడూరు ఎస్.ఐ.వరలక్ష్మీదేవి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాలను వెలికి తీశారు.
పూర్తి వివరాలు తెలియరాకపోవడంతో మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోషల్‌మీడియాలో మృతుల ఫొటోలు వైరల్ కావడంతో వీరు పోరుమామిళ్ల పట్టణం శ్రీరామనగర్ కాలనీకి చెందిన బళ్లారి రామకృష్ణ (43), అనూష (35) దంపతులు తమ పిల్లలు నిఖిల్ (4), కల్యాణ్ (నాలుగు నెలలు)గా తెలిసింది. దీంతో పోలీసులు రామకృష్ణ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.
రామకృష్ణ ఫైనాన్స్ వ్యాపారం చేసి తలకు మించిన అప్పులు చేశాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక శుక్రవారం మధ్యాహ్నం రామకృష్ణ, స్వరూప దంపతులు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయారని, అప్పటినుంచి వారి సమాచారం తమకు తెలియలేదని రామకృష్ణ తండ్రి పోలీసులకు చెప్పాడు. సోషల్‌మీడియాలో వారి ఫోటోలు చూసి తమవారేనని తెలుసుకున్నామని తెలిపాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రామకృష్ణ అప్పుల పాలు కావడంతోనే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.