ఈటలతో బీజేపీకి బలమా? బీజేపీతో ఈటలకు లాభమా? కేసీఆర్ లెక్కేంటి?
posted on Jun 5, 2021 @ 2:43PM
ఎన్నెన్నో అనుకుంటారు. అన్నీ అవుతాయాయేం. రాజకీయాల్లో మరీ అసాధ్యం. ఈటల వస్తారు.. కొత్త పార్టీ పెడతారు.. అందరినీ కలుపుకొని కేసీఆర్ పోరాడుతారు.. గడీల పాలన పోయి గరీబోళ్ల ప్రభుత్వం వస్తుందని తలిచారు.. ఒకలా అనుకుంటే.. ఈటల మరోలా నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరబోతున్నారు. ఆ ప్రకటన చాలా మంది తెలంగాణవాదులకు నచ్చలేదంటున్నారు. ఉద్యమ వీరుడు.. మరోసారి ఉద్యమ బాట పడతాడేమో.. తాము సైతమంటూ కదం కదపటానికి.. ఈటల వెనకాలే నడవడానికి.. చాలా మంది సిద్దమయ్యారు. కానీ, ఆయన ఆస్తుల రక్షణ కోసమో.. కేసుల కుట్రల నుంచి బయటపడటానికో.. కారణం ఏమో తెలీదు కానీ.. జాతీయ పార్టీ బీజేపీకి జై కొట్టారు. సొంత జెండా ఆలోచన వదిలేసి.. కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.
బీజేపీలో ఈటల చేరిక ఎవరికి లాభం? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బలమైన ఉనికి కోసం కసిగా పోరాడుతున్న బీజేపీకి ఈటల చేరిక నిస్సందేహంగా బలమే. కమలం పార్టీకి తెలంగాణలో అభిమానులు ఎక్కువే. కానీ, ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చే సత్తా గల నాయకులు తక్కువే అని చెప్పొచ్చు. బీజేపీ అంటే.. హైదరాబాద్‌లో కూర్చొని కేసీఆర్‌పై విమర్శలు చేసే.. గుప్పెడు మంది నాయకులే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రగతి భవన్ పాలనపై ప్రజా వ్యతిరేకత భారీగానే ఉన్నా.. ఆ వ్యతిరేకులను బీజేపీ వైపు మరల్చే ఛరిష్మా ఉన్న నేతల కొరత ఆ పార్టీని వేధిస్తోంది.
దశాబ్దాల తరబడి.. విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలాంటి సైద్ధాంతిక పరమైన, క్లాస్ లీడర్లే బీజేపీకి బాస్‌లుగా ఉండేవారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చాక పార్టీలో దూకుడు పెరిగింది. గ్రామస్థాయి కార్యకర్తపై లాఠీ దెబ్బ పడినా.. బండి సంజయ్ నుంచి రియాక్షన్ వస్తోంది. కార్యకర్తలకు నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు సంజయ్. కానీ, బండి సంజయ్ ఒక్కరే.. ఒంటి చేతితో కేసీఆర్‌పై దండయాత్ర చేయలేరు. ఈటల లాంటి బలమైన నాయకుడు జత కలిస్తే.. ఇక బీజేపీకి తిరుగుండదు అంటున్నారు. ఈటలకు స్టేట్ వైడ్ పాపులారిటీ ఉంది. ఉద్యమ నాయకుడిగా మంచి పరిచయాలు, ప్రజల్లో ఆదరణ ఎక్కువే. అందుకే, ఈటల బలం.. ఇకపై బీజేపీకి అదనపు బలంగా మారనుంది. సో, ఈటల చేరిక బీజేపీకే లాభం!.. మరి, ఈటలకు...?
అటు, ఈటలకూ తాత్కాలికంగా లాభమేనంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ కుట్రలు, కేసులపై పోరాడే ధైర్యం, తెగువ వస్తుంది. కాషాయ జెండా నీడన కాస్తంత సేద తీరవచ్చు. సొంతపార్టీ పెడితే మనుగడ కష్టం. బీజేపీ అయితే.. ఇప్పటికిప్పుడు తన వాయిస్ బలంగా వినిపించేందుకు, గులాబీ బాస్‌పై పోరాడేందుకు సత్తా, సత్తువ వస్తుంది.
అయితే, బీజేపీలో ఈటల ఎప్పటికైనా టాప్ లీడర్ కాగలడా? అంటే అనుమానమే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఏ నాయకుడూ.. బీజేపీలో కీలక నేత కాజాలడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. సంఘ్ పరివార్ ఆశీస్సులు లేని వారికి ఉన్నత పదవులు దక్కకపోవచ్చు. బయటి పార్టీల నుంచి వచ్చి.. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన వారు దేశవ్యాప్తంగా ఎక్కరంటే ఒక్కరు కూడా లేరు. కాబట్టి, ఈటల బీజేపీ నుంచి సీఎం కేండిడేట్ కానే కారు. అదే, సొంతపార్టీ పెట్టుకుని ఉంటే ఆ ఛాన్స్ ఉండేది.
ఇక బీజేపీ అందరిపార్టీ కాదు.. కొన్ని వర్గాల్లో మాత్రమే కమలంపార్టీకి ఆదరణ ఉందనేది వాస్తవం. ప్రధానంగా అర్బన్ ఏరియాల్లో, వ్యాపార వర్గాల్లోనే బీజేపీకి బలం. గ్రామాల్లో, రైతుల్లో, కూలీల్లో బీజేపీ సానుభూతిపరులు తక్కువే. ఇక ముస్లింలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కమలనాథులు ఇంకా చేరువ కాలేదనే చెప్పాలి. బీసీల్లోనూ బీజేపీ ఇంకా పుంజుకోనే లేదు. ఆ ప్రభావం ఈటలపైనా పడొచ్చు. ఇన్నాళ్లూ ఈటలను.. అన్ని వర్గాల వారూ ఆదరించగా.. ఇకపై బీజేపీ నేతగా కొన్ని వర్గాలకు ఆయన దూరం కాక తప్పదు. అదే సమయంలో ఈటలను ఇష్టపడే మరికొన్ని వర్గాలు బీజేపీకి చేరువచ్చే అవకాశమూ ఉంటుంది.
అటు.. కోదండరాం సార్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటల చేరిక వలన బీజేపీకే లాభమన్నారు. ఈటలకొచ్చేదేమీ లేదని వాపోయారు. బీజేపీలో చేరాలనే ఈటల నిర్ణయం ఉద్యమకారులతో పాటు కోదండరాం సార్‌ను సైతం నిరుత్సాహ పరిచింది. మంచి అవకాశాన్ని ఈటల చేజార్చుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారని ప్రజలు భావించారని, ఒక ఫోర్స్‌గా తయారవుతారని తెలంగాణ సమాజం ఈటల వైపు చూసిందన్నారు. ఈటల నిర్ణయంతో కేసీఆర్‌పై పోరాడాలని అనుకున్న వాళ్లు సైతం చల్లబడిపోయారన్నారు. కేసీఆర్ మీద పోరాటం చేస్తే తాను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసివస్తామని ఈటలకు చెప్పామన్నారు కోదండరామ్ వివరించారు. కానీ, ఈటల బీజేపీలో చేరాలనే నిర్ణయం.. తెలంగాణలో వస్తుందనుకున్న మరో స్వపరిపాలన ఉద్యమం.. ఆలోచన స్థాయిలోనే చతికిలపడింది. ఈటల లాంటి నేతే.. కొత్త పార్టీ పెట్టడానికి వెనకంజ వేశారంటే.. ఇక ఇప్పట్లో తెలంగాణ గడ్డపై కొత్తపార్టీ పెట్టాలనే ధైర్యం మరెవరూ చేయకపోవచ్చు అంటున్నారు. కేసీఆర్‌కూ కావలసింది ఇదే.