పొడుగోడి నెత్తి పోశమ్మ కొట్టడం ఖాయమా? ఈటల మతలబేంటి?
posted on Jun 5, 2021 @ 1:09PM
పొట్టోడి నెత్తి.. పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తి.. పోశమ్మ కొడుతుంది. ఈ తెలంగాణ సామెతను ప్రస్తావిస్తూ.. ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు ఏదో ఆవేశంలో వచ్చినవి కావని.. వ్యూహాత్మకందా అన్న డైలాగేనని అంటున్నారు. రాజీనామాకు ముందే అంతా క్లారిటీ తెచ్చుకున్నాకే.. భవిష్యత్ పరిణామం ఇదేనంటూ.. ప్రగతిభవన్‌లో రీసౌండ్ వచ్చేలా ఈ మెసేజ్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ సామెతలో పొట్టోడు, పొడుగోడు, పోశమ్మ గురించి చర్చ జరుగుతోంది.
ఈ సామెతలోని పొట్టోడు ఇంకెవరు మాజీ మంత్రి ఈటల రాజేందరే. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పొడుగోడు. అధికారం చేతిలో ఉండటంతో.. పొట్టోడైన ఈటల నెత్తి కొట్టాడు పొడుగోడైన కేసీఆర్. భూకబ్జా ఆరోపణలతో ఈటలను కేబినెట్ నుంచి గెంటేసి.. కేసులు బనాయించి.. కొడుకుపైనా కేసులు పెట్టించి.. మస్తు సతాయించి.. ఆయనే పార్టీ వీడేలా చేశారు కేసీఆర్. ఈ ఎపిసోడ్‌తో పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. అనే టాపిక్ కంప్లీట్ అయిపోనట్టే. మరి, పొడుగోడి నెత్తి కొట్టే పోశమ్మ ఎవరనేదే ఇక్కడి ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఇంకెవరు.. కేంద్ర ప్రభుత్వమే.. బీజేపీనే.. మోదీనే.. అంటున్నారు విశ్లేషకులు. అందుకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పదే పదే చేసే వ్యాఖ్యలను ముందుంచుతున్నారు. "కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం". బండి సంజయ్ నోటి నుంచి అనేకసార్లు వచ్చింది ఈ మాట. ఆయన ఊరికే అనడం లేదట ఈ డైలాగ్. కేంద్రం నుంచి ఆ మేరకు లీకులుంటేనే బండి నోటి నుంచి ఈ డైలాగ్ వస్తోందని తెలుస్తోంది. తాజాగా, ఈటల రాజేందర్ సైతం అదే తరహా అర్థం వచ్చే సామెత చెప్పడంతో.. కేసీఆర్ నెత్తి కొట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందనే చర్చ మరోసారి ప్రస్తావనకు వస్తోంది. .
తాజాగా ఈటల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో.. త్వరలో తెలంగాణలో సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం వస్తోంది. గులాబీ బాస్ టార్గెట్ గా ఢిల్లీలో కీలక పరిణామాలకు ప్లాట్‌ఫాం సిద్దమవుతోందని తెలుస్తోంది. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతి చేసిందని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్.. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తాజాగా మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందన్నారు. సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా బయటకు తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. త్వరలో ఆయనును జైలుకు పంపించడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బండి సంజయ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే సంజయ్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయినప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కరెప్షన్ గురించే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి కేబినెట్ నుంచి తప్పించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పైనా అదే స్థాయిలో రివేంజ్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తాను బీజేపీలో చేరాలంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారట ఈటల. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు ఉన్న ఆస్తులు.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ సభ్యులకు విపరీతంగా పెరిగిన సంపద గురించి వివరించారట. ప్రాజెక్టుల్లో భారీగా ముడుపులు తీసుకోవడం, పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం, పలు కంపెనీల్లో వాటాలు, రిసార్టులు, స్టార్ హోటళ్లు, ఫామ్‌హౌజుల యవ్వారం గురించి ఈటల తనకు తెలిసిన సమాచారమంతా కేంద్రం ముందుంచారని అంటున్నారు. అవన్నీ పరిశీలించి.. సరైన సమయంలో కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని జేపీ నడ్డా ఈటలకు హామీ ఇచ్చారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో.. కేసీఆర్ ముందరి కాళ్లకు బంధాలు వేస్తామని జేపీ నడ్డా గ్యారంటీ ఇచ్చారని సమాచారం.
కేంద్రం నుంచి వచ్చిన హింట్ మేరకే.. ఈటల రాజేందర్ నర్మగర్బంగా ఆ సామెతను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పొట్టోడినైన తన నెత్తిని పొడుగోడైన కేసీఆర్ కొడితే.. పొడుగోడైన కేసీఆర్ నెత్తిని.. పోచమ్మ అయిన కేంద్రం కొడుతుందని ఆ సామెత.. అర్థం.. పరమార్థం.. అంటున్నారు. ఇదే తెలంగాణలో జరగబోయే భవిష్యత్ రాజకీయ ముఖచిత్రం అని ఆ సామెతను విశ్లేషిస్తున్నారు.