ఎంపీ రఘురామ మొబైల్ ఎక్కడ? పీవీ రమేష్ ట్వీట్ కలకలం..
posted on Jun 5, 2021 @ 1:56PM
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఓ మొబైల్ నంబరు నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని, ఆ నంబరు ఎంపీ రఘురామకృష్ణరాజుదని తెలిసిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించాలని ఆయన కోరారు. దీంతో రఘురామకృష్ణరాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు.
'ఏపీ సీఐడీ పోలీసులు మే 14న నన్ను అరెస్టు చేసిన రోజున నా మొబైల్ ఫోనును అనధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ అది వారి వద్దే ఉంది. దాన్ని తిరిగి ఇచ్చేయాలని శుక్రవారం లీగల్ నోటీసులు పంపాను. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించాను.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను' అని రఘురామకృష్ణరాజు వివరించారు. 'మే 14 నుంచి జూన్ 1 వరకు నేను ఎవ్వరికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంపలేదు. నిబంధనలకు విరుద్ధంగా నా మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇతరులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇస్తున్నాను' అని రఘురామ చెప్పారు. దీనిపై స్పందించిన పీవీ రమేశ్ స్పష్టత ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశారు.
రాజద్రోహం కేసులో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు మే14 సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అదే రోజు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. తనను అరెస్ట్ చేసిన తన ఐఫోన్ ను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని గతంలోనే రఘురామ కృష్ణం రాజు చెప్పారు. ఇప్పుడు రఘురామ ఫోన్ నుంచి తమ కుటుంబ సభ్యులకు మెసేజులు వస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ రాజు ఫోన్ ఎక్కడుంది.. ఆయన నెంబర్ నుంచి మెసేజ్ లు ఎవరు చేస్తున్నారన్నది సంచలనంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి మెసేజ్ లు రావడం తీవ్ర అంశంగా మారే అవకాశం ఉంది. అది కూడా గతంలో సీఎం జగన్ కు సలహాదారుగా చేసి.. తర్వాత అతనితో విభేదించి బయటికి వెళ్లిన అధికారి కుటుంబ సభ్యులకు ఆ సందేశాలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రఘురామ ఫోన్ సీఐడీ దగ్గరే ఉందా లేక ఎవరైనా బయటివ్యక్తుల చేతికి వెళ్లిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్ నోటీసు ఇచ్చారు. తన అరెస్ట్ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులో ఎంపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదన్న విషయాన్ని కూడా నోటీసులో ఆయన చెప్పుకొచ్చారు. ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్‌లోనే ఉందని.. పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసులో రఘురామ ఒకింత హెచ్చరించారు. అయితే ఈ లేఖపై ఇంతవరకూ సునీల్ స్పందించలేదు.