14న ఈటల ముహుర్తం.. 13న కేసీఆర్ మంత్రాంగం!
posted on Jun 11, 2021 @ 11:10AM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 14న జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు రాజేందర్. బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఈటల టార్గెట్ గా దూకుడు పెంచారు గులాబీ బాస్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈటలకు కౌంటర్ గా ఈనె 13న సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ , బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కరీంనగర్ జిల్లా నేతలతో జరగనున్న ఈ సమావేశంలోహుజూరాబాద్ పైనే కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.
ఈటల లాగా పార్టీలో మరెవ్వరూ ధిక్కార స్వరం వినిపించే సాహసం చేయకుండా చూసేందుకు ఆయనను ఓడించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉందని చెబుతున్నారు. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పక్కనపెట్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు మాదిరిగానే హుజూరాబాద్‌లో కూడా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించి ఈటలను అన్ని వైపులా ముట్టడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం మండలానికో మంత్రిని, ఒక్కో ఎమ్మెల్యేను, ఇతర ముఖ్యనాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. మరికొద్ది రోజుల్లో మండలానికి మరో ఎమ్మెల్యేను కూడా కేటాయించనున్నట్లు సమాచారం. అన్ని కులాలకు చెందిన మంత్రులను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, ఈటల మద్దతుగా నిలుస్తున్నవారి వివరాలతో నివేదికలను సిద్ధం చేస్తున్నారట. హుజూరాబాద్ అర్బన్, రూరల్ ప్రాంతాలకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సతీష్‌బాబు.. జమ్మికుంట మండలానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుడు ఆర్ రమేశ్.. వీణవంక మండలానికి శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు.. ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఇన్‌చార్జీలుగా నియమించారు. కమలాపూర్ మండల బాధ్యతలను మంత్రి దయాకర్‌రావు, శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డికి అప్పగించారు. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్. మంగళ, బుధవారాల్లో కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో ఆయన తిరిగారు. ఈ సందర్భంగా ఈటలకు ఎలాంటి మద్దతు వచ్చింది, జనాల స్పందన ఎలా ఉందన్న విషయాలపైనా టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసిందని తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, జనాల్లో ఏదైనా మార్పు వస్తుందా, ప్రభుత్వ పథకాలపై స్పందన ఎలా ఉంది అన్న అంశాలతో పాటు.. అభ్యర్థి విషయంలోనూ గులాబీ బాస్ ఫోకస్ చేశారని చెబుతున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం త్వరలో టీఆర్ఎస్ లో చేరనుందని తెలుస్తోంది. బీజేపీకి చెందిన మరికొందరు నేతలను కూడా కారెక్కించేలా పావులు కదుపుతున్నారని సమాచారం.