పదేళ్ల లవ్ మిస్టరీ.. ఓ మంచి సినిమాలాంటి కథ..
posted on Jun 10, 2021 @ 6:41PM
ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు. అక్షరాల పదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువతి.. తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడి ఇంట్లోనే ఉన్నా ఎవ్వరికీ తెలియలేదు. కనీసం యువకుడి కుటుంబం కూడా గుర్తించకపోవడం విశేషం.
ఓపెన్ చేస్తే అది కేరళ. పాలక్కడ్ జిల్లా. ఆ జిల్లాలో ఓ విచిత్రమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. అయిరూర్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఆమె వయసు 18 సంవత్సరాలు. కారణం ఏంటో తెలియదు గానీ, 2010 ఫిబ్రవరిలో ఇంటి నుంచి పారిపోయింది. అయితే, గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో కుటుంబసభ్యులకు ఆచూకీ తెలియలేదు. సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికిట్లు అయింది వాళ్ళ పని. చివరికి ఓ విచిత్రం ఏంటంటే ఆమె తన తల్లిదండ్రులుండే ఇంటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి దగ్గరే ఉన్నా ఎవరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు, యువతి ఆ ఇంటిలో ఉన్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియకపోవడం మరో ట్విస్ట్.
వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె తన ప్రియుడితో ఉంటోంది. ఆమె ప్రియుడే తన యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆ గదికి వాష్ రూమ్ కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోకుండా ఒక నియమావళి పెట్టుకుని చుట్టూ పక్కల జనం అంత పడుకున్న తర్వాత ఓ కిటికీ నుంచి రాత్రిపూట ఆమె బయటకు వచ్చేది. పగలు ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలన్నీ ప్రియుడే సమకూర్చేవాడు. ఒకటి రెండు కాదు ఏకంగా ఇలా పదేళ్లు మూడో వ్యక్తికి తెలియకుండా గుట్టుగా ఆ గదిలోనే ఉండిపోయింది.
కట్ చేస్తే.. మూడు నెలల కిందట మార్చిలో ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. అద్యశ్యమైంది ఒకరు కాదు.. ఇద్దరిని.. ఆ ఇద్దరే ఈ ప్రేమికులని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని విథాన్‌స్సెరీ అనే ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్టు యువతి కోర్టుకు తెలపడంతో ప్రియుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు.
చివరికి ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు కూడా స్వాగతించారు. పదేళ్లపాటు ఎవ్వరి కంటపడకుండా ఆమెను కాపాడాడని పోలీసులు తెలిపారు. దీని వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అన్న ప్రశ్నకు ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందిస్తూ.. వారి బంధువుల నుంచి అన్ని వివరాలను సేకరించామని అన్నారు. కుటుంబసభ్యులు కూడా ఎలాంటి వివరాలు చెప్పలేదని తెలిపారు.