కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదా? రాహుల్ లోకల్ లీడరేనా?
posted on Jun 10, 2021 @ 7:10PM
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా?.. కాదనే అంటున్నారు, ఆ పార్టీతో మూడు తరాల అనుబంధం ఉన్న, కేంద్ర మాజీ మంత్రి, జితిన్ ప్రసాద. అంతే కాదు తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన, దేశంలో ఒక్క బీజేపీ మినహా మిగిలిన జాతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు ఉండవలసిన లక్షణాలు లేనే లేవని అన్నారు.అలా ఆయన దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని, ఒకే ఇక్క ముక్కలో తేల్చేశారు. నిజానికి, కొత్తగా కమలం గూటికి చేరిన జితిన్ ప్రసాద చేసిన ఈ వ్యాఖ్య సంపూర్ణ సత్యం కాకపోయినా, అందులో కొంత నిజముంది. కొంత అతిశయోక్తి ఉంది.
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవ స్థితిని కోల్పోయింది. ఇది నిజం. అయినా ప్రజల్లో కాంగ్రెస్ ఇంకా సజీవంగానే ఉంది, ఓట్లు, సీట్లు లెక్కలు అటూ ఇటూ అయితే కావచ్చును, వరస ఓటములతో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటున్నది కూడా నిజం కావచ్చును. అయినా, కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్ పార్టీకి 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.అదే, యూపీఏ రెండవసారి అధికారంలోకి వచ్చిన 2009 లోక్ సభ ఎన్నికలలో అద్వానీ నాయకత్వంలో పోటీ చేసిన బీజేపీకి 18 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతమాత్రం చేత బీజేపే జాతీయ పార్టీ కాకుండా పోయిందా, ఐదేళ్ల తర్వాత అదే బీజేపీ మోడీ నాయకత్వంలో అధికారంలోకి రాలేదా? సొంతంగా 282 సీట్లు గెలుచుకుని 30 ఏళ్ల చరిత్రను తిరగ రాయలేదా? రాజకీయాలలో ఓడలు బండ్లు , బండ్లు ఓడలు అవుతాయి. అది సహజం. అంత మాత్రాన అదే శాశ్వతం అనుకోలేము. అనుకోరాదు. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితిని, డౌన్ బట్ నాట్ అవుట్’ అనే అనుకోవచ్చును.
అయితే ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగని, నాయకత్వ సమస్యను ఎదుర్కుంటోంది.. కాంగ్రెస్ పార్టీని వరసగా రెండు సార్లు అధికారంలో నిలబెట్టిన సోనియా గాంధీ, వయసు, వయసుతో పాటు వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీల పాత్రను పోషించేలేక పోతున్నారు. ఇక రాహుల్ గాంధీ విషయం అయితే వేరే చెప్పనే అక్కరలేదు. నిజానికి రాహుల్ గాంధీ పార్టీకి మోయరాని భారంగా మారారు అన్న మాట పార్టీ వర్గాల్లోనే వినవస్తోంది. అలాగే ఆయనే ఉంటే, అన్నట్లుగా ఆయనే సక్రమంగా, సరైన రీతిలో నాయకత్వ లక్షణాలను అలవారచుకుంటే, ఇప్పుడు జితిన్ ప్రసాదనే కాదు, సంవత్సరం క్రితం కాంగ్రెస్’ను వీడి కమల దళంలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కూడా కాంగ్రెస్’ను వదిలే వారు కాదు. మధ్య ప్రదేశ్’లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబడేది. సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్ ముగ్గురూ రాహుల్ గాంధీ ప్రియ మిత్రులు. అందులో ఇద్దరు ఆయనతో విసిగి పోయి, తమ దారి తాము చుకున్నారు. నిజానికి, ఏ పార్టీలో అయినా ఎమ్మల్యే ఆ క్రింది స్థాయి రాజకీయ నాయకులు కూడా తమ అనుచరుల బాగోగులు చుసుకుంటారు. అంతే కానీ, ఇటు పార్టీని, అటు అనుచరులను గాలికి వదిలేసి, ట్విట్టర్ రాజకీయాలు చేయరు. అయినా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుదు మాత్రం ట్వీట్లతోనే రాజకీయం చేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జితిన్ ప్రసాద బుధవారం బీజేపీలో చేరడం, ఉత్తర పదేశ్’లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, మరింత చికాకులు తెచ్చి పెడుతుంది. మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సున్నాకు చేరుకుందో, అదే విధంగా రేపటి యూపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రస్తుతమున్న ఏడు సీట్లు కూడా కోల్పోయినా, ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. ముఖ్యంగా, పన్నెండు శాతం ఉన్న బ్రాహ్మణ ఓటు చేజారినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు . జితిన్ ప్రసాద గత ఏడాది బ్రాహ్మణ చేతనా మంచ్ ఆరంభించడం వెనుక బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయని కూడా అంటారు. కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన రీటా బహుగుణ జోషి సహా యోగి మంత్రివర్గంలో అరడజనుమంది బ్రాహ్మణులే ఉన్నా, పార్టీ పదవుల్లోనూ వారి సంఖ్య బాగానే ఉన్నా, ఆ సామాజికవర్గంపై జితేంద్ర ప్రసాద కుటుంబానికి ఉన్న పట్టు, గుర్తింపు బీజేపీకి రాజకీయంగా ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక రాహుల్ గాంధీ పార్టీ బరువును తమ భుజస్కందాల పైకి ఎత్తు కోవడమో ... లేక రాహుల్ గాంధీ భారాన్ని కాంగ్రెస్ పార్టీ దించుకోవడమో, రెండింటిలో ఎదో ఒకటి జరగనిదే, కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోలేదని కాంగ్రెస్ నాయకులే నిర్ణయానికి వచ్చారు.అందుకే, ప్రసాద సహా 21 మంది సీనియర్ నాయకులు . నాయకత్వ సమస్య పరిష్కరించాలని సంవత్సరంగా పట్టు పడుతున్నారు. అయినా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అందుకే, నిన్న సింధియా, ఈరోజు జతిన్ ప్రసాద, రేపు రాజేష్ పైలట్ .. ఆ నెక్స్ట్ డే..ఇంకొకరు ఇలా ఒకరొకరు పార్టీని వదిలి పోతూనే ఉనతారు. అయితే, రాహుల్ బరువు ఎత్తుకోవడమో, పార్టీ రాహుల్ భారాన్ని తగ్గించుకోవడమో..రెంటిలో ఏదీ జరిగే సూచనలు అయితే కనిపించడం లేదు.