ఏపీ సీఐడీ సునీల్ కు గండం! ఆ వీడియోల్లో ఏముంది..?
posted on Jun 11, 2021 @ 10:49AM
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఈ పేరు కొన్ని రోజులుగా మార్మోగుతోంది. ఢిల్లీ స్థాయిలోనూ వినిపిస్తోంది. ఆయనేదో గొప్ప పని చేసినందుకు కాదు... నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో ఆయన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ఎంపీ రఘురామ కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సునీల్ కుమార్ పేరు మీడియాలో ప్రముఖంగా వస్తోంది. జాతీయ మీడియాలోనూ ఆయనపై కథనాలు వస్తున్నాయి. రఘురామ రాజు ఫిర్యాదుతో ఆయన పోస్టింగ్ ఊస్టింగ్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
తాజాగా ఏపీ సీఐడీ సునీల్ కుమార్ కు సంబంధించి మరో సంచలన అంశం వెలుగులోనికి వచ్చింది. ఆయన పదవి ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. అయితే ఎంపీ రఘురామ కేసు విషయంలో కాదు.. ఆయన రిజర్వేషన్ అంశంలో తాజా పరిణామం కీలకంగా మారింది. సునీల్ కుమార్ రిజర్వేషన్ ద్వారా తన ఉద్యోగానికి ఎన్నికయ్యారు. అయితే, భారత రాజ్యాంగం ప్రకారం… క్రిస్టియన్ మతం స్వీకరించిన వారికి రిజర్వేషన్లతో వచ్చిన ఉద్యోగాలు పోతాయి. ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే కోర్టులు కూడా తీర్పులిచ్చాయి.
మతం మారితే ఉద్యోగం కోల్పోతారంటూ ఇటీవల వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పుతో.. సునీల్ కుమార్ పై లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని కాబట్టి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సునీల్ కుమార్ తాను క్రిస్టియన్ అని గతంలో చాలా సార్లు ఓపెన్ గానే చెప్పుకున్నారు. దీంతో ఆయన పదవికి గండం ఖాయమని అంటున్నారు.
మరోవైపు తనపై ఫిర్యాదు విషయం తెలిసిన వెంటనే సునీల్ కుమార్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. గతంలో ఆయన చేసిన క్రిస్టియన్ ప్రసంగాల వీడియోలు ఇంటర్నెట్ నుంచి మాయం అయ్యాయి. అయితే ఆయన తొలగించిన వీడియోలను ఆల్రెడీ డౌన్ లోడ్ చేసి కేంద్ర హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేశారు. ఇంకా కొన్నిచోట్ల సునీల్ కుమార్ వీడియోలు లభ్యం అవుతున్నాయి. బ్రిటీష్ వారిని పొగుడుతూ, క్రిస్టియన్ మతం గొప్పదని చెప్పే వీడియోలు ఫిర్యాదుదారుల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఆ కేసులో సంచలనం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది.