వైసీపీలో ఆనందయ్య చిచ్చు.. మంత్రి, ఎంపీ మధ్య వార్
posted on Jun 10, 2021 @ 5:21PM
కృష్ణపట్నం ఆనందయ్య మందు మొదటి నుంచి వివాదాల్లోనే చిక్కుకుంది. ఏపీ ప్రభుత్వం మందు పంపిణి ఆపేయడం రచ్చగా మారింది. హైకోర్టు జోక్యంతో ఆనందయ్య మందు పంపిణికి లైన్ క్లియరైంది. ఇలా ఎన్నో వివాదాలు, అడ్డంకులను అధిగమించిన ఆనందయ్య మందు పంపిణి.. వైసీపీ నేతల తీరుతో గందరగోళం పడింది. చివరకు అధికార పార్టీ నేతల్లోనే చిచ్చు రేపుతోంది. మందు పంపిణి కోసం పోటీ పడుతున్న వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది.
ఆనందయ్య మందును సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పంపిణి చేస్తున్నారు. మందు కోసం సొంతంగా తన ఫోటోలతో కవర్లు తయారు చేయించారు కాకాని. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.అటు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణి సాగుతోంది. ఆయన కూడా జగన్ తో పాటు తన ఫోటోలతో బాక్సులు తయారు చేయించాడు. దీంతో ఆనందయ్య మందుతో వైసీపీ నేతలు పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. సొమ్మెకరిది సోకొకరిది అన్నట్లుగా అధికార పార్టీ నేతల తీరు ఉందనే విమర్శలు జోరుగా వస్తున్నాయి.
ఈ వివాదాలు ఇలా ఉండగానే... ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకుల మధ్య ఆనందయ్య కరోనా మందు విషయంలో రచ్చ జరుగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే కమ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు.. నువ్వా-నేనా అన్నట్టుగా పోటా పోటీగా మందును పంపిణీ చేస్తున్నారు. రెడ్డి కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. మాగుంట వైసీపీలోకి రావడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే.. రాజకీయ అవసరాల నేపథ్యంలో జగన్.. మాగుంటను పార్టీలోకి చేర్చుకుని ఏకంగా ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా.. జిల్లాలో మాగుంట పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు. బాలినేని వల్లే మాగుంట జీరోగా మిగిలారనే చర్చ జిల్లాలో సాగుతోంది.
తాజాగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆనందయ్య మందు విషయంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, దూకుడుగా ముందుకు సాగాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి నిర్ణయించుకున్నారు. అటు మంత్రి బాలినేని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆనందయ్య మందు తయారై.. పంపిణీకి ఇద్దరు నేతలు ప్రత్యేకంగా శిబిరాలు పెట్టుకుని మందు పంపిణీ ప్రారంబించారు. మాగుంట స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌ను ఎంచుకుని శిబిరం ఏర్పాటు చేసి మందు పంపిణీ చేస్తుండగా.. బాలినేని ఏకంగా పార్టీ ఆఫీస్‌నే మందు పంపిణీకి కేంద్రంగా మార్చేశారు. ఆధార్ ఆధారంగా బాలినేని వర్గం మందును పంపిణీ చేస్తుంటే.. మాగుంట మాత్రం కార్పొరేటర్ల నుంచి స్లిప్పులు తెచ్చిన వారికి మందును ఇస్తున్నారు.
నెల్లూరులో ఆనందయ్య మందు పంపిణీకి రెండు కేంద్రాలు ఏర్పడి.. పార్టీ నేతలు రెండుగా చీలిపోయి పంపిణీని చేస్తుండడంతో రాజకీయంగా దుమారం రేగింది. నిజానికి మందు తయారీ, పంపిణీల విషయంలో రాజకీయ జోక్యం వద్దని హైకోర్టు చెప్పినా.. ఇద్దరు నేతలు మాత్రం ఇలా విడిపోయి మందును పంపిణీ చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని అంటున్నారు.