సరికొత్త మద్యపాన నిషేధం.. ఏపీలో కనీవినీ ఎరుగని పాలసీ
posted on Jun 11, 2021 @ 4:43PM
దూబగుంట రోశమ్మ బతికి ఉంటే నేడు ఏపీలోని మద్యపాన నిషేధం తొలి అడుగులు చూసి మూర్ఛపోయేవారేమో. ఎన్టీఆర్ అయితే షాక్ తినేవారు. చంద్రబాబునాయుడు అయితే అరే ఈ టెక్నిక్ తెలియక మద్యపాన నిషేధాన్ని ఎత్తేశానని బాధపడుతున్నారేమో. మద్యపానంతో ముంచెత్తుతూ మద్యపాన నిషేధం హామీని నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి తెలివికి జై కొట్టాల్సిందే. అసలు మాట తప్పను..మడమ తిప్పను అనేదాన్ని ఇలా కూడా నిరూపించుకోవచ్చని చేసి మరీ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.. ఇవన్నీఆయన ప్రత్యర్ధుల కామెంట్లు. కాని రోజురోజుకు కొత్త విషయాలతో కొత్త పుంతలు తొక్కుతుందీ మద్యపాన నిషేధం.
మద్యపాన నిషేధం అమలు చేస్తానని..ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించారు జగన్. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇప్పుడు వైసీపీయేలెండి.. ఆయన షాపులో కల్తీ మద్యం తాగి జనం చచ్చిపోయిన సందర్భంలోనే ఈ చర్చ వచ్చింది. అప్పుడే హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.. కాని ఆయన దానిని నిలబెట్టుకుంటారని.. అది కూడా ఇలా నిలబెట్టుకుంటారని ఎవరూ ఊహించలేకపోయారు.
ముందు మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతికి తెచ్చేశారు. స్టాఫ్ కూడా వీళ్లే పెట్టారు. అలా మద్యం వ్యాపారమంతా ప్రభుత్వం చేతికి.. అదే వైసీపీ నేతల చేతికి చిక్కింది. ఆ తర్వాత మరో వ్యాపారం మొదలైంది. కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేశారు. వైసీపీ నేతలే బేవరేజెస్ కంపెనీలు తెరిచారు. ఫ్యాక్టరీలతో పొత్తు పెట్టుకుని బ్రాండ్లను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత అవే బ్రాండ్లు అమ్మాలని..అవే తాగాలని కండిషన్ పెట్టేశారు. నేషనల్,ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అమ్మటం మానేశారు. ఆ తర్వాత లోకల్ బ్రాండ్స్ తప్ప..ఏవీ రాష్ట్రానికి రానివ్వకుండా సరిహద్దుల్లో కాపలా పెట్టారు. అలా నిర్బంధంగా వీరి బ్రాండ్లు తాగిపిస్తూ.. ప్రభుత్వానికి, వారికీ ఇద్దరికీ ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇదే సరికొత్త మద్యపాన నిషేధం.
అదేమంటే ఐదేళ్లలోపు చేస్తానన్నాను.. 2023 ఎన్నికల ముందు మద్యం షాపులు మూసేసి.. అదిగో నిషేధం అంటారు..ఎన్నికలైపోయి అదికారంలోకి వచ్చాక ఆదాయం సరిపోవడం లేదని మళ్లీ తెరుస్తారు. అదే జరగబోయే కథ. ఇప్పుడు కొత్తగా ఈ షాపుల్లో స్కాములు జరుగుతున్నట్లు బయటపడింది. ఇప్పటికే స్టాక్ ను బయటకు తెచ్చి అక్రమంగా అమ్ముకోవటానికి వైసీపీ నేతలు లోకల్ గా షాపుల్లో స్టాఫ్ తో కుమ్మక్కయ్యారు. అది మరో అడుగు ముందుకేసి...అమ్మకాలతో వచ్చిన డబ్బును ప్రభుత్వానికి కట్టకుండా పక్కదారి పట్టే పరిస్ధితి వచ్చింది. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఈ స్కాములు బయటపడ్డాయి.. కాని అన్ని జిల్లాల్లోనూ ఇది జరుగుతుందనేది సమాచారం.
అలా మద్యపాన నిషేధం పేరుతో వ్యాపారాలను స్వాధీనం చేసుకుని..సొంత వ్యాపారాలను డెవలప్ చేసుకుని..ఆఖరికి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును కూడా కాజేసే రేంజ్ కి ఎదిగిపోయిందీ మద్యపాన నిషేధం. బెల్టు షాపులు అని గతంలో ఆందోళన చెందేవారు.. ఇప్పుడు బెల్టు షాపులు పోయి..బైకు షాపులు వచ్చేశాయి. లోకల్ వైసీపీ నేతలు కొందరు రింగ్ అయి.. షాపు నుంచి సరుకు తెప్పించి డెలివరీ చేసేలా ఏర్పాటు చేశారు.. కాకపోతే.. దాని రేటు వేరేగా ఉంటుంది. అలా మద్యపానం తగ్గింది లేదు..మద్యం తాగడం ఎవరూ మానింది లేదు.. రెండేళ్లు దాటిపోయింది... మద్యపాన నిషేధం మాత్రం అమలుకు అడుగులు వేస్తూనే ఉంది.