అందరికీ వ్యాక్సిన్లు ఇస్తే ప్రమాదం! కొత్త వేరియంట్ల ముప్పుపై మోదీకి వైద్య నిపుణుల లేఖ
posted on Jun 11, 2021 @ 1:12PM
కరోనా సైంటిస్టుల్లో హైరానా పుట్టిస్తోంది. సూక్ష్మజీవి మానవ శాస్త్ర విజ్ఙానానికి ఓ పట్టాన అంతుపట్టడం లేదు. అందుకే, ఎప్పటికప్పుడు వైరస్ విషయంలో అంచనాలు తప్పుతున్నాయి. వైరస్ వ్యాప్తి నుంచి చికిత్సా విధానం, మందుల వరకూ.. ఇప్పటి వరకూ ఎందులోనూ పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోతున్నారు. తాజాగా, కొవిడ్ పాటిట బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సిన్ల విషయంలోనూ వర్రీ మొదలైంది. ఇష్టం వచ్చినట్టు టీకాలు వేస్తే.. వైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయంటూ వైద్య నిపుణుల బృందం హెచ్చరిస్తోంది. ఆ మేరకు వారంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.
కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో.. సామూహిక, విచక్షణారహిత, అసంపూర్ణ వ్యాక్సినేషన్ వల్ల తీవ్ర పరిణామాలుంటాయని లేఖలో తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా టీకాలు ఇవ్వడం వల్ల వైరస్‌లో మ్యుటేషన్లు చోటుచేసుకొని కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ముప్పుందని హెచ్చరించారు. ఎయిమ్స్ వైద్యులతో పాటు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్‌కు చెందిన నిపుణులు.. మోదీకి రాసిన లేఖ వ్యాక్సినేషన్‌పై డేంజర్ బెల్ మోగిస్తోంది.
దేశ ప్రజలందరికీ టీకా వేయడం కంటే.. వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి మొదట టీకా ఇవ్వడం మంచిదని సూచించారు. కరోనా బారిన పడిన వారికి టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్‌తో పని తేదని తెలిపారు. యువతకు కాకుండా.. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి టీకా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు. డెల్టా వేరియంట్ విజృంభణతో కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని సూచించారు.
వైరస్ వ్యాప్తిపై ఉన్న శాస్త్రీయ సమాచారం, ధ్రువీకరించిన గణాంకాల ఆధారంగానే ముందుకు సాగాలని వైద్య నిపుణులు ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో కాకుండా.. అందరికీ వ్యాక్సినేషన్ వల్ల.. జనాభాలో చాలా తక్కువ మందికి టీకాలు చేరతాయని.. అలా చేస్తే వైరస్ కట్టడి కష్టమేననేది నిపుణుల అభిప్రాయం.