ఈటలతో మళ్లీ బిజెపి షో.. దుబ్బాక సీన్ రిపీట్?
posted on Jun 11, 2021 @ 7:18PM
బిజెపి వాళ్లకు మళ్లీ ఓ ఛాన్స్ వచ్చింది. దుబ్బాకతో కాస్త లేచారు..గ్రేటర్ తో హుషారు పెరిగింది. మళ్లీ సాగర్ తో చతికిలపడ్డారు. కాని ఇప్పుడు లేవడానికి హుజురాబాద్ ఎదురొస్తోంది. ఈటల రాజేందర్ బిజెపిలో చేరుతుండటంతో.. హుజురాబాద్ ఉప ఎన్నిక పేరుతో మళ్లీ తెలంగాణలో హల్ చల్ చేయడానికి బిజెపి ప్లాన్ చేస్తోంది. ఎటూ ఈటలకే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉండటంతో... ఆ సీటు గెలిచి.. మళ్లీ తొడగొట్టాలని చూస్తోంది.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు అయిపోగానే ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం మారినట్లు అనిపించింది. కాంగ్రెస్ వెనక్కుతోసి బిజెపి ముందుకొచ్చిమరీ టీఆర్ఎస్ కు సవాల్ విసురుతున్నట్లే కనిపించింది. బండి సంజయ్ పంచ్ డైలాగులు, ధర్మపురి అరవింద్ విసుర్లుతో బిజెపియే తర్వాత అధికారంలోకి వచ్చేది అన్న పీలింగ్ తెప్పించేశారు.కాని అపర చాణక్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు వెంటనే ఢిల్లీ వెళ్లి మోదీగారితో భేటీ అయి.. మేం మేం కలిసిపోయాం.. తెలంగాణ బిజెపి నేతలంతా ఆటలో అరటిపండ్లన్న ఫీల్ తీసుకొచ్చేశాడు. అంతే బిజెపి వేడి అంతా చప్పున చల్లారిపోయింది.ఆ తర్వాత బిజెపి, టీఆర్ఎస్ నేతలు ఎంత పరుషంగా తిట్టుకున్నా.. జనానికి మాత్రం అది కామెడీ అయిపోయింది. దీనికి తోడు పెద్దగా పట్టు కూడా లేని నాగార్జునసాగర్ లో పోటీ చేసి అభాసుపాలయ్యారు. ఈ ఎన్నిక తోనే..కాంగ్రెస్ ఉంది.. అది కూడా సెకండ్ ప్లేస్ లో..రాష్ట్రమంతా చూస్తే బిజెపికి కాంగ్రెస్ అంత బలం లేదనే లెక్కలు బయటికొచ్చాయి. దీనికి తోడు బిజెపి రాష్ట్రానికి ఏం చేయలేదనే వాదనలు పెరగటం.. కోవిడ్ విషయంలో యాంటీ మోదీ ఫ్లేవర్ మొదలవటం.. దేశవ్యాప్తంగానే మోదీ సంస్కరణలకు ఎదురుగాలి రావడంతో... మరింత నీరసపడ్డారు..డిఫెన్సులోనూ పడ్డారు.
ఇప్పుడు వీళ్లకి ఈటల రాజేందర్ హార్లిక్స్ లా దొరికాడు. ఈటల హుజూరాబాద్ లో ఎలాగూ గెలవాలి. బిజెపి టిక్కెట్ మీద గెలిస్తే.. అది ఆయన సొంతబలం మీద గెలిచినా.. క్రెడిట్ బిజెపి అకౌంట్లో పడిపోతుంది. అందుకే మళ్లీ హడావుడి మొదలెట్టారు. మరో బీసీనాయకుడు తమకు పోటీ రావడం బండి సంజయ్, అరవింద్ లకు ఇష్టం లేకపోయినా..అధిష్టానం నిర్ణయంతో ఒప్పుకోక తప్పలేదు. అప్పుడే బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ టీఆర్ఎస్ తో భవిష్యత్ లో కూడా పొత్తు ఉండదని... ఆ ఆలోచనే మానేయమని తమ నేతలకు, కార్యకర్తలకు క్లాసు తీసుకున్నాడు. ఇవన్నీ హుజూరాబాద్ పోరును గేరెక్కించడానికే.
ఇక ఈటల రాజీనామాతో మొదలెట్టి.. ప్రతి రోజూ మనం బిజెపి నేతల సవాళ్లు, పంచ్ లు.. బెదిరింపులు అన్నీ వినాల్సి ఉంటుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక పేరుతో రాష్ట్రమంతా మార్మోగిపోయేలా మీడియాలో వాయించి పడేస్తారు. మరి కల్వకుంట్లవారు ఈ వ్యూహాన్ని ఎలాఎదుర్కొని..హుజురాబాద్ ను గెలుచుకుంటారో.. లేక సాధ్యం కాదని వదిలేస్తారో చూడాలి.