నామాతో టీజర్.. కేసీఆర్‌తో క్లైమాక్స్!.. ఈటల కళ్లల్లో ఆనందం కోసమేనా?
posted on Jun 11, 2021 @ 3:56PM
టీఆర్ఎస్ కీలక నేత, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు. బ్రేకింగ్ న్యూస్ ఇది. సడెన్‌గా ఈడీకి నామా ఎందుకు గుర్తొచ్చారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏకంగా టీఆర్ఎస్ లోక్‌సభ ఫ్లోర్‌లీడర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దాడులు చేశాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సమయం, సందర్భాన్ని బట్టి.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కేంద్రంలో ఏదో జరుగుతోందనే అనుమానం మరింత బలపడుతోంది.
ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీ పెద్దలను కలవడం.. కేసీఆర్ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడం.. సరైన సమయం కోసం చూస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చెప్పడం.. నెల రోజులుగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాక్షాలు సేకరిస్తున్నామని, త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించడం.. ఇలా వరుస పరిణామాల తర్వాత.. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులపై ఈడీ అటాక్స్ జరగడం కాకతాళీయం కాకపోవచ్చు అంటున్నారు. భవిష్యత్‌లో కేసీఆర్ టార్గెట్‌గా జరిగే చర్యలకు.. ఇప్పుడు నామా ఎపిసోడ్ జస్ట్ టీజర్ మాత్రమేనని.. పిక్చర్ అబీ బాకీహై.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు కమలనాథులు.
కాషాయ కండువా కప్పుకునేందుకు ఈటల బీజేపీ ముందు పెట్టిన ఒకే ఒక్క డిమాండ్.. కేసీఆర్ అక్రమాస్తుల భరతం పట్టడం. ఆ ఒక్క డిమాండ్‌పై పక్కా హామీ ఇస్తే చాలు.. తాను బీజేపీలో చేరుతానంటూ ఈటల ఢిల్లీతో కమిట్ అయ్యారట. ఆ మేరకు కాషాయం పెద్దల నుంచీ ఆయనకు ప్రామిస్ లభించిందని చెబుతున్నారు. అయినా.. ఈటలలో ఏదో అనుమానం. బీజేపీని నమ్మొచ్చా? జిత్తులమారి కేసీఆర్ మోదీతో మిలాఖత్ అయితే? భవిష్యత్‌లో ఆ రెండు పార్టీలు కలిస్తే తన పరిస్థితేంటి? ఇలా అనేక డౌట్స్ రాజేందర్‌ను వెంటాడాయి. అందుకే ఆ పార్టీలో చేరడం కాస్త ఆలస్యమైంది. ఈటలకు డౌటే అవసరం లేదు.. కేసీఆర్ సంగతి త్వరలోనే తేలుస్తామని అధిష్టానం అభయం ఇచ్చింది. అయినా, ఈటలలో సందేహం వీడకపోవడంతో.. ఆయన అనుమానం నివృత్తి చేయడానికే.. టీజర్‌గా నామాపై ఈడీ దాడులు జరిగాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. నామా ఎపిసోడ్‌తో ఇటు ఈటలకు భరోసా ఇవ్వడంతో పాటు.. అటు కేసీఆర్‌కూ ఝలక్ ఇచ్చినట్టు అవుతుందని.. అందుకే రాబోవు కాలంలో.. కాబోవు పరిణామాలకు నామా ఉదంతంతో శ్రీకారం చుట్టారని విశ్లేషకులు చెబుతున్న మాట.
నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు.. సీఎం కేసీఆర్ జైలు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పదే పదే ఊదరగొడుతున్నారు. నెల రోజులుగా ఆయనకు వ్యతిరేకంగా సాక్షాలు సేకరించే పనిలో ఉన్నామంటూ ఇటీవల సంచలన స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. కేసీఆర్‌ను కాస్త సైడ్ చేసే.. ఇక తెలంగాణను దున్నేయవచ్చనేది కమలనాథుల లెక్క. ఆ లెక్కన.. గులాబీ బాస్ అక్రమాలు, అవినీతిపై రహస్యంగా చిట్టా సేకరిస్తున్నారట. కాషాయ భావజాలమున్న ఓ టీవీ ఛానెల్‌లో కేసీఆర్, ఆయన సంబంధీకుల అవినీతిపై నిత్యం వార్తలు రావడం అందులో భాగమేనంటున్నారు. డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిపైనే మొదటగా అటాక్ చేయకుండా.. నామా లాంటి వారితో మొదలుపెట్టి.. టీఆర్ఎస్‌లో భయం పుట్టించి.. చివరాఖరికి అవినీతి తిమింగలాన్ని వలలో బంధించాలనేది ఎత్తుగడలా కనిపిస్తోందని అంటున్నారు.
తమ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల కళ్లల్లో ఆనందం నింపేందుకు.. కేసీఆర్ అండ్ కోపై తాము సీరియస్‌గానే ఫోకస్ పెట్టామనే స్ట్రాంగ్ మెసేజ్ పంపేందుకు.. నామాపై ఈడీ దాడులతో ముందస్తు టీజర్ రిలీజ్ చేశారని అంటున్నారు. ఇక కేసీఆర్‌తోనే క్లైమాక్స్ అని అనుమానిస్తున్నారు. ఈ మధ్యలో ముందుముందు మస్తు డ్రామా నడవబోతుందని అంచనా వేస్తున్నారు.