ఈటలకు బిగ్ షాక్.. గులాబీ గూటికి కౌశిక్ రెడ్డి?
posted on Jun 11, 2021 @ 4:56PM
తెలంగాణ రాజకీయాలన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజూరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. సోమవారం బీజేపీలో చేరనున్న ఈటల రాజేందర్.. శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండటంతో.. నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈటలను ఓడిచేందుకు వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. అందివచ్చే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది . అందులో భాగంగానే కీలక నేత కారెక్కేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ కు సంబంధించి ఓ కీలక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి భేటీ అయ్యారు. కేటీఆర్, కౌశిక్ ఓ ప్రైవేటు ఫంక్షన్ లో కలుసుకున్నారు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ పై చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపు ప్రైవేటుగా మాట్లాడుకున్నారు. చివరగా కేటీఆర్ ను కారు ఎక్కిస్తూ డోర్ దగ్గర నిలబడి కొద్ది సేపు ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. .కౌశిక్ రెడ్డి.. కేటీఆర్ ను కలవడంతో త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని సమాచారం.
గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కౌశిక్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయానా కజిన్ బ్రదర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డికి గట్టి పట్టుంది. అన్ని గ్రామాల్లోనూ ఆయనకు అనుచరులు ఉన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఈటెలకు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కౌశిక్ పేరు కూడా వినిపిస్తోంది.దీంతో కౌశిక్ రెడ్డి కారెక్కితే హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత రంజుగా మారనుంది.
మరోవైపు పీసీసీ చీఫ్ఉ త్తమ్ కు చెప్పకుండా కౌశిక్ ఏమీ చేయరన్న అభిప్రాయం కూడా ఉంది. కేటీఆర్ తో భేటీ వ్యవహారం ఉత్తమ్ కు తెలియకుండానే జరిగిందా… లేక ఆయనకు ముందస్తు సమాచారం ఉందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు గాంధీ భవన్లో వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.