డాక్టర్లు దేవదూతలు.. టీకాపై దిగొచ్చిన బాబా.. జ్ఞానోదయానికి అదే కారణమా?
posted on Jun 11, 2021 @ 2:01PM
నెల రోజులుగా దేశంలో రామ్‌దేవ్ బాబా రచ్చ అంతా ఇంతా కాదు. అల్లోపతితో ఓ ఆట ఆడుకుంటున్నారు ఈ యోగా గురు. అల్లోపతి అసలు వైద్యమే కాదంటూ ప్రశ్నల పరంపరతో దాడి చేస్తున్నారు. వైద్యులు సైతం ఎక్కడా తగ్గట్లేదు. కేంద్రానికి లేఖలు, కోర్టు కేసులతో రామ్‌దేవ్ బాబాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు డాక్టర్లు. దీంతో.. దేశంలో అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది.
భయమో లేక బాధ్యతో.. కారణం ఏంటో తెలీదు కానీ.. రామ్‌దేవ్ బాబా బాగా కూల్ అయిపోయారు. ఆయన మాటలు బాగా మారిపోయాయి. వైద్యులు భూమిపై తిరుగాడుతున్న దేవదూతలంటూ కొనియాడారు. అత్యవసర చికిత్స, సర్జరీలకు అల్లోపతి ఉత్తమమైనదని ప్రశంసించారు బాబా వారు.
ఆయుర్వేదానికి మించిన వైద్యం లేదని, తాను కరోనా టీకా వేయించుకోబోనని గతంలో తెగేసి చెప్పారు రామ్‌దేవ్ బాబా. ఇప్పుడు ఆ అభిప్రాయం కూడా మార్చుకున్నారు. త్వరలో తాను కూడా కరోనా టీకా వేయించుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులు టీకా తీసుకోవాలని కోరారు. కొవిడ్ కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని అన్నారు. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతించారు రామ్‌దేవ్ బాబా.
తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని రామ్‌దేవ్ బాబా స్పష్టం చేశారు. యోగా గురులో సడెన్‌గా వచ్చిన ఈ మార్పుకు కారణమేంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారా? వారం రోజుల్లోనే అల్లోపతి అద్భుతమని ఎందుకు అనిపించిందని ఆరా తీస్తున్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదంటూ పరోక్షంగా కేంద్రాన్నే సవాల్ చేసిన బాబా నోటి వెంట.. హఠాత్తుగా ఇలా మంచి మాటలు రావడం వెనుక ఢిల్లీ నుంచి వచ్చిన స్ట్రాంగ్ వార్నింగే కారణమంటున్నారు. వైద్య,ఆరోగ్య శాఖతో పెట్టుకుంటే.. కరోనిల్ బిజినెస్‌కు ఎక్కడ దెబ్బ పడుతుందోననే భయంతోనే బాబా దిగొచ్చారని అంటున్నారు.