బెంగాల్ కాంగ్రెస్ కథ సమాప్తం..
posted on Jun 11, 2021 @ 4:08PM
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా అయినా తెరవలేక పోయింది. సీపీఎంతో జట్టు కట్టి, పొత్తులో భాగంగా 90 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన హస్తం పార్టీ, ఒక్క సీటు గెలుచుకోలేక పోయింది. జోగీ జోగీ రాసుకుంటే బూడిత రాలింది, అన్నట్లుగా సీపీఎం పార్టీ కూడా సున్నాకే పరిమితం అయింది. మూడు దశాబ్దాలకు పైగా రాష్టాన్ని పాలించిన వామపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మొత్తం 294 స్థానాలకు గాను, 292 స్థానాలకు ఎన్నికలు జరిగితే, తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లతో బ్రహ్మాండ విజయాన్ని సొంతం చేసుకుంది. అధికారానికి అర్రులు చాచిన బీజేపీ, మూడు అంకెల సఖ్యను కూడా చేరుకోలేక పోయింది. కేంద్ర హోమ్ మంత్రి ఆశించిన 200 ప్లస్ ప్రభంజనం 77 దగ్గరే చతికిల పడింది. బీజేపీ వంద మార్కు దాటదన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్’ కిషోర్, మాటా నిజమైంది.
తృణమూల్ అంత ఘన విజయం సాధించినా, ముఖ్యమంత్రి, పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ, నందిగ్రామ్’లో ఓడి పోయారు. సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి కాకుండా, మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారిని ఓడిచడమే లక్ష్యంగా, నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన దీదీ అదే సువేందు చేతిలో ఓడిపోయారు. అయినా, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకుని ఆమె మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, రాజ్యాంగంలోలోని 164(4)అధికరణం ప్రకారం ఎమ్మెల్యే కాకుండా,ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆమె ఆరు నెలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉంటుంది. అమెకు అదేమీ కష్టం కాదు. ఏ నియోజక వర్గం నుంచి అయినా ఆమె నామినేషన్ వేస్తే చాలు, ఆమె గెలిచి పోతారు. అందులో సందేహం లేదు.
అందునా ఆమె ఈసారి ఆమె సొంత నియోజక వర్గం, భవానీపూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.ఆమె కోసం మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్ నుంచి గెలిచిన తృణమూల్ ఎమ్మెల్యే సోమన్ దేవ్ రాజీనామ చేశారు. దీంతో భవానీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే,ఈ ఉప ఎన్నికల్లో తప్పక గెలవవలసి ఉంటుంది. నిజానికి, ఇంతకూ ముందే అనుకున్నట్లుగా ఉపఎన్నికలలో దీదీ గెలుపు గురించి ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఈ నియోజక వర్గంలో మాములుగానే ఆమె గెలుపు నల్లేరు మీద నడక,అలాంటిది ప్రత్యేక పరిస్థితిలో ఆమె గెలుపు గురించి ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.
మమతకు విజయం చేకూర్చడం కోసం, భవానీపూర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయక పోవడం మంచిదని, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి భావిస్తున్నారు. అంతే కాదు, ఆయన తమ అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ ద్వారా తెలియచేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్న అధీర్ ఆలోచను కాంగ్రెస్ నాయకులే తప్పు పడుతునారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే అది ఆత్మహత్యా సాదృశ్యం అవుతుందని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకు రాలు, ఎమ్మెల్యే అతిధి అన్నారు. బెంగాల్లోనే కాకుండా దేశం అంతటా ఆ ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె బెంగాల్’ లో బీజేపీ అధికారంలోకి రానందుకు, రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేయడాన్ని కూడా తప్పు పట్టారు. మోడీ ఓటమిని చూసి ఆనందించే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉండడం, పార్టీ నాయకత్వం భావ దరిద్ర్యానికి అద్దం పడుతోందని, అలాగే ఉప ఎన్నికల్లో పోటీనే చేయరాదనే నిర్ణయమే తీసుకుంటే, బెంగాల్ కాంగ్రెస్ కథ ముగిసినట్లే భావించవలసి ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు.