రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేసీఆర్ స్కెచ్? ప్రగతి భవన్‌లో మీటింగ్?
posted on Jun 26, 2021 @ 11:43AM
రేపేమాపో రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు. ఆలస్యమైనా ఆయన పేరే దాదాపు కన్ఫామ్. అయితే, అధిష్టానం రేవంత్‌రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే వరకూ ఏదైనా జరగొచ్చు. కాంగ్రెస్ రాజకీయం అలానే ఉంటుంది మరి. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేయడానికి ఏ ఒక్క సీనియర్ నేత కూడా ఒప్పుకోవడం లేదు. వెటరన్ బ్యాచ్ అంతా ఏకమై ఆ డైనమిక్ లీడర్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంలో లాబీయింగ్ ఓవైపు.. రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసే పని మరోవైపు. ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో.. ఇప్పుడిక హైకమాండ్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేందుకు కూడా వెనకాడలేదు సీనియర్లు. రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిని చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామన్నట్టుగా వ్యవహరించారు. అందుకే, ఢిల్లీకి ఝలక్ ఇవ్వడానికే తాజాగా ప్రగతి భవన్ వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారని చెబుతున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సైతం ప్రగతి భవన్ గేట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం తెరవడం మరింత ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకే.. కేసీఆర్ ఇలాంటి స్కెచ్ వేశారని అంటున్నారు. ఇటు కేసీఆర్.. అటు కాంగ్రెస్ సీనియర్స్.. అంతా కావాలనే.. తమ ప్రయోజనాల కోసమే మరియమ్మ లాకప్ డెత్‌ను అడ్డుపెట్టుకొని ప్రగతిభవన్ వేదికగా పొలిటికల్ డ్రామా నడిపించారని అంటున్నారు. తాజా పరిణామంతో ఇటు కేసీఆర్.. అటు కాంగ్రెస్ సీనియర్స్.. అంతా కలిసి రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టే నాటకానికి తెర తీశారని చెబుతున్నారు.
కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ ఛరిష్మా ఉన్న రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే.. ఇక కాంగ్రెస్‌లో వన్‌మ్యాన్ షో నే ఉంటుంది. ఇక కేవలం రేవంత్‌రెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది. కేసీఆర్‌కు నిద్రలేకుండా చేస్తూ.. రేవంత్‌రెడ్డి చిచ్చరపిడుగులా చెలరేగిపోవడం ఖాయం. కాంగ్రెస్‌లో రేవంత్.. మరో వైఎస్సార్‌గా మారుతారని భావిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను ఆక్రమించేస్తే.. ఇన్నాళ్లూ పార్టీలో హవా చెలాయించిన సీనియర్ల ఖేల్ ఖతం.. దుకాణం బంద్. అందుకే, వాళ్లకు రేవంత్ అంటే కళ్లమంట. ఎంత డ్డుకున్నా.. అధిష్టానం మాత్రం రేవంత్‌రెడ్డి వైపే ఇంట్రెస్టింగ్‌గా ఉండటం.. సీనియర్లకు మింగుడుపడని అంశం. మేటర్ ఇక క్లైమాక్స్‌కు చేరడంతో ఏకంగా హైకమాండ్‌కే ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో కాల్డ్ సీనియర్స్. తమని కాదని రేవంత్‌కు పగ్గాలు అప్పగిస్తే.. తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందనే మెసేజ్ ఇవ్వడానికే కేసీఆర్‌ను ఇంటికెళ్లి మరీ కలిశారని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టేందుకే సీఎం కేసీఆర్ సైతం.. ఏడేళ్లుగా ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ సీనియర్లకు పావుగంటలోనే అపాయింట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఉభయ ప్రయోజనాల మేరకే.. మరియమ్మ సాకుగా ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు.
కేసీఆర్‌ను కలిసిన బ్యాచ్-- భట్టి విక్రమార్క. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి. ఈ నలుగురూ మొదటి నుంచీ కేసీఆర్‌కు విధేయులేననే ప్రచారం ఉంది. సీఎల్పీ లీడర్ భట్టి.. కేసీఆర్‌పై సుతిమెత్తగా దాడి చేస్తుంటారు. విమర్శించినట్టు నటిస్తారనే అపవాదు ఉంది. మధిరలో టీఆర్ఎస్ శ్రేణులో భట్టిని గెలిపించాయనే రూమర్ కూడా ఉంది. ఇక మరో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. మొదటినుంచో ఆయనకు కేసీఆర్‌పై సాఫ్ట్ కార్నరే. ఇక రాజగోపాల్‌రెడ్డి. ఆయన టీఆర్ఎస్ వైపు చూడకున్నా.. కాంగ్రెస్‌ను వీడాలని గట్టిగా నిర్ణయించేసుకున్నారు. అందుకే పలుమార్లు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగానే విమర్శించారు కూడా. బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ప్రకటించగానే కాంగ్రెస్‌లో పడే ఫస్ట్ వికెట్ రాజగోపాల్‌రెడ్డే కావొచ్చు అంటున్నారు. ఇక జగ్గారెడ్డి గురించి చెప్పేదేముంది. తాను కేసీఆర్‌ను విమర్శించను అంటూ బాహాటంగానే ప్రకటించేశారు. రేవంత్‌రెడ్డి పగ్గాలు ఇవ్వొద్దంటూ లొల్లి లొల్లి చేస్తున్నారు. ఆయనకు హరీష్‌రావుతో ప్రాబ్లమ్ అంతేకానీ ఆయన మనసంతా టీఆర్ఎస్సే. అలాంటిది ఇటీవల ఓ కార్యక్రమంలో హరీశ్‌రావుకు వందనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే. జగ్గారెడ్డి త్వరలోనే కారెక్కడం ఖాయమంటున్నారు.
ఇలా రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆ నలుగురు.. కేసీఆర్‌ను కలిసి కాంగ్రెస్ అధిష్టానానికి నేరుగా మెసేజ్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే.. ఆయనకు సహాయ నిరాకరణ తప్పదని.. తమ దారి తమదేననేలా బెదిరింపులకు దిగారని అంటున్నారు. లేదంటే.. రేవంత్‌రెడ్డికి పట్టాభిషేకం జరగబోయే ఈ కీలక సమయంలో ఆ నలుగురు అలా ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవడమేంటి? సర్కారుపై ఓవైపు కమలనాథులు కత్తులు దూస్తూ కాంగ్రెస్ ప్లేస్‌ను బర్తీ చేస్తుంటే.. బీజేపీకి పోటీగా కేసీఆర్‌పై మరింతగా దూకుడు పెంచాల్సింది పోయి.. ఎంచక్కా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ట్రాప్‌లో పడేటంతటి అమాయకులేమీ కాదు ఆ నలుగురు. అందుకే.. ఊహలు.. గుసగుసలాడుతున్నాయి..