ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు సెల్యూట్.. ప్రభుత్వం విఫలమంటూ విమర్శలు..
posted on Jun 25, 2021 @ 4:34PM
ఆనందయ్యను ఎంతగా ఆగం చేయాలో అంతకంటే ఎక్కువే ఆగం చేశారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఆనందయ్య మందు పేరు జనం నోళ్లలో నానకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు అందరికీ ఉచితంగా లభించిన ఆ మందు.. ఇప్పుడు కొందరికే పరిమితమవడం బాధాకరం. ఏపీ ప్రభుత్వం ఎంతగా రాజకీయం చేసినా.. చేస్తున్నా.. ఆనందయ్య మందు ఖ్యాతిని మాత్రం అడ్డుకోలేకపోతోంది. రాష్ట్రాల సరిహద్దులు దాటి.. ఆ వనమూలికల మందుకు ప్రాముఖ్యం దక్కుతోంది.
తాజాగా, ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేయడం విశేషం.
డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయంటూ ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు న్యాయమూర్తులు. ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్. కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇలా ఆనందయ్య మందు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులనైతే మెప్పించింది కానీ, మన రాష్ట్ర పాలకుల దయను మాత్రం పొందలేకపోతోంది. ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే తాను అందరికీ మందును ఉచితంగా అందించలేకపోతున్నానని ఆనందయ్య స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం పాలకుల సహాయనిరాకరణకు నిదర్శనం. ఆయూష్ అనుమతులు ఉన్నా.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. జనాల్లో డిమాండ్ ఉన్నా.. మందు మాత్రం అందుబాటులో లేకపోవడం దారుణం. మందు తయారీకి కావలసిన కరెంట్, గిన్నెలు, పంపిణీకి సాయం చేయకుండా ఏపీ సర్కారే ఆనందయ్య మందుపై కుట్ర చేసిందనే విమర్శలు ఉన్నాయి. కొందరు వైసీపీ నాయకులు ఆనందయ్యను హైజాక్ చేసి.. మందు తయారు చేయించుకొని.. తమ ఫోటోలతో రాజకీయ ప్రచారానికి వాడుకున్నారే కానీ.. ఆనందయ్య మందును అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరఫున చిన్న ప్రయత్నమన్నా చేసిన పాపాన పోలేదు.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులే ఆనందయ్యకు సెల్యూట్ చేశారంటే ఆయన గొప్పతనం అలాంటిది మరి. అయినా, మన పాలకులు ఆ కరోనా మందుపై ఇంతటి కుట్రలు చేయడం బాధాకరం. ఆనందయ్య మందు తీసుకోవాలని అనుకున్నా.. అది లభించక మరణించిన ప్రతీ ప్రాణానికి పరోక్షంగా ఏపీ ప్రభుత్వమే కారణమంటున్నారు. మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని.. న్యాయమూర్తుల మాటలు ఆలకించైనా.. ఇప్పటికైనా ఆనందయ్య మందుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు ప్రజలు.