ప్రగతి భవన్ లో మారిన సీన్.. టీవీ చూస్తూ కేసీఆర్ ఫుల్ ఖుషీ..
posted on Jun 26, 2021 @ 12:25PM
ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. సీఎం కేసీఆర్ నివాసం ఉండేది అక్కడే. అయితే ప్రగతి భవన్ తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా ఉంది. కేసీఆర్ టార్గెట్ చేసే విపక్ష నేతలు ప్రగతి భవన్ ప్రస్తావన లేకుండా మాట్లాడరు. ప్రగతి భవన్ కాదు అది బానిస భవన్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ లోకి ఎవరికి ఎంట్రీ ఉండదన్నారు. మంత్రులు కూడా ప్రగతి భవన్ లోకి వెళ్లలేరని చెప్పారు. ప్రగతి భవన్ కు వెళ్లి..అనుమతి లేక ఎన్నోసార్లు అవమానపడ్డామని చెప్పారు. బానిస భవన్ కోటలు బద్దలు కొట్టడమే తన లక్ష్యమన్నారు. ఈటలే కాదు కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు కూడా సీఎంను కలిసేందుకు వెళితే ప్రగతి భవన్ లోకి రానియ్యలేదని చాలా సార్లు ఆరోపించారు.
ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉండదనే ఆరోపణలు జనాల్లోనూ వ్యక్తమవుతుండగా.. తాజాగా కీలక పరిణామాలు చోటు చోసుకుంటున్నారు. ఈటల బీజేపీలో చేరిక తర్వాత అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్ ను వీడి ప్రజల్లోకి వచ్చారు సీఎం కేసీఆర్. అంతేకాదు ప్రగతి భవన్ గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఏడేండ్లుగా ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టలేకపోయిన కాంగ్రెస్ నేతలకు సడెన్ గా ఎంట్రీ దొరికింది. సీఎల్పీ నేత భట్టీ ఆధ్వర్యంలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. మంతనాలు సాగించారు. ఇదే షాకింగ్ అనుకుంటే.. మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆదివారం దళిత సమస్యలపై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. అన్ని పార్టీల్లోని దళిత నేతలు, ప్రజాసంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
ప్రగతి భవన్ లోకి మంత్రులు వెళ్లడానికే కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి సామాన్యులు కూడా వెళ్లేలా పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ రూట్ మార్చడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రగతి భవన్ కేంద్రంగా జరుగుతున్న ప్రచారంతో పార్టీకి డ్యామేజీ జరుగుతుందని గ్రహించిన కేసీఆర్.. డ్యామేజీ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. అందుకే అందరికి ఆహ్వానం పంపుతూ చర్చలు జరుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ లో వచ్చి న మార్పుతో గులాబీ లీడర్లే ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత మళ్లీ ప్రగతి భవన్ నిషేదిక కోటగా మారిపోతుందని మరికొందరు విమర్శిస్తున్నారు.
మరోవైపు రోటీన్ కు భిన్నమైన సీన్ కు ప్రగతిభవన్ వేదికైందని తెలుస్తోంది. సమీక్షలు. సమావేశాలు, వివిధ అంశాల మీద అధ్యయనాలే తప్పించి.. కులాశాగా అందరూ కూర్చొని టీవీ చూడటం అనే కాన్సెప్టు ప్రగతిభవన్ లో కనిపించదు. అందుకు భిన్నంగా శుక్రవారం రాత్రి మాత్రం భిన్నమైన సీన్ కనిపించిందని చెబుతున్నారు. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరుతో ప్రముఖ డిస్కవరీ చానల్ లో ప్రసారమైన కార్యక్రమాన్ని ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెబుతున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీఫిలిం డైరెక్టర్ రాజేంద్ర శ్రీవత్స దీన్ని రూపొందించారు. దీన్ని తాజాగా డిస్కవరీ చానల్ ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యల్ని.. అనుసరించిన విధానాల్ని ఇందులో చూపించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ కథనాన్ని అసాంతం వీక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు నేతలు.. అధికారులు ఈ షోను చూసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లారు.షెడ్యూల్ లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వారు సైతం.. వాటికి డుమ్మా కొట్టేసి చానల్ లో వచ్చే ప్రోగ్రాంను సీఎం కేసీఆర్ తో కలిసి చూసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సీన్ ప్రగతిభవన్ లో మరెప్పుడూ చూడలేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. టీవీలో డిస్కవరీ చానల్ ను దాదాపు గంట పాటు చూడటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇదే మొదటిసారి అన్న మాటను కొందరు అధికారులు చెబుతున్నారు.