చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ... ఎప్పుడంటే..?
posted on Jun 25, 2021 @ 4:56PM
మెగా స్టార్ చిరంజీవి, మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? త్వరలోనే ఆయన మరో మారు, రాజ్య సభ ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమవుతూ వచ్చిన చిరంజీవి, 2017 ఖైదీ నెం.150 తో సినిమా రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇక అక్కడి నుంచి వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా అయన సినిమా రంగంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య సినిమా, విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అది గాక లూసిఫర్ రీమేక్ చిత్రంతో పాటుగ మరో మూడు నాలుగు చిత్రాలు కూడా లైన్’లో ఉన్నాయని తెలుస్తోంది.
చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి గత కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్’ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, ఆయన అడుగులు వైసీపీ వైపు వెళుతున్నాయని కూడా అంటున్నారు. కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీ స్టాండ్’కు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లును గట్టిగా సమర్ధించారు. అధికార వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక, సామాజిక అసమానతలు తొలిగి పోతాయని. ఇంచుమించుగా వైసీపీ డైలాగులానే ఆయన కూడా వల్లెవేశారు. అలాగే, మరో ఒకటి రెండు సందర్భాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అహో ఓహో అంటూ తెగ మెచ్చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో సారి, దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్’లోనూ ఒకే రోజున రికార్డు స్థాయిలో కొవిడ్ టీకాలు వేశారు. ఈ సందర్భంగానూ చిరంజీవి, అదేదో ఒక్క ఆంధ్ర ప్రదేశ్’లోనే జరిగినట్టు, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో అటు సినిమా ఇండస్ట్రీలో హాట్ టపిక్ అయింది. ఇదే సమయంలో ‘మా’ ఎన్నికలు కూడా రావడం, చిరంజీవి తమ అభ్యర్ధిగా ప్రకాష్ రాజ్’ను బరిలో దించడంతో సిని’మా’ వర్గాల్లో, మా’ ఎన్నికల ఈక్వేషన్స్’తో పాటుగా చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీతో స్టేట్ పాలిటిక్స్ లో చోటు చేసుకునే క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి, కూడా చర్చ జరుగుతోంది.
వైసీపీకి చెందిన, నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం, వచ్చే సంవత్సరం జూన్ నెలలో ముగుస్తుంది. అంటే అందుకు మరో సంవత్సర కాలం వుంది . ఈలోగా చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని, ఫుల్ టైమ్. పొలిటిషియన్’ గా రీఎంట్రీ ఇచ్చేందుకు, సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవి వస్తానంటే ..వద్దంటానా’ అన్న సంకేతాలను ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం. చిరంజీవి వస్తే ఆయనతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం కొంతైనా ఉంటుందని, పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, 2009 ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీని అటు టీడీపీ, తెరాస, వామపక్ష పార్టీల మహా కూటమిని ఎదుర్కుని కూడా 71 లక్షల పై చిలుకు ఓట్లతో 18 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.
సరే, ఆ తర్వాత ఆయన చేతికి చిక్కిన చక్కని అవకాశాన్ని, చేజేతులా జారవిడుచుకున్నారు. ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్రంలో సహాయ మంత్రిగా సర్దుకు కూర్చున్నారు . 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో రాజ్య సభ సభ్యత్వం గడవు ముగిసేవరకు, కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్లు ఉంటూ వచ్చి, ఆతర్వాత 2017 మెగాస్టార్ అమ్మడు కుమ్ముడు అంటూ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ స్టార్ మెగా స్టార్’ అంటూ దూసుకు పోతున్నారు. అయితే, ఆయనకు ఇంకా రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లలేదు. అందుకే సినిమా రంగంలో లానేరాజకీయ రంగంలోనూ సెకండ్ ఇన్నింగ్స్’కు సిద్దమై పోతున్నారని అంటున్నారు. అయితే అందుకు మరో సంవత్సరం టైముంది.. , ఈ లోగా, ట్విట్టర్ తెర మీద గెస్ట్ పొలిటిషియన్ రోల్స్ ప్లే చేస్తారు , కావచ్చును