జబర్దస్త్‌గా బీజేపీ పోల్ మేనేజ్‌మెంట్.. ఈటల ఇక బిందాస్...
posted on Jun 25, 2021 @ 3:56PM
కమలదళం దండెత్తితే ఎట్టా ఉంటాదో తెలుసా? కాషాయపార్టీ వ్యూహాలు ఎంత పకడ్బందీగా ఉంటాయో తెలుసా? రామభక్తుల మోహరింపు ఏ రేంజ్‌లో ఉంటాదో తెలుసా? ఓట్ల పోరులో ప్రతీ ఓటును ఎంత పక్కాగా ఫోకస్ చేస్తారో తెలుసా? ఒక్క ఓటర్ కూడా మిస్ అవకుండా ఇంటింటికీ కాషాయ కండువా ఎట్టా వెళుతుందో తెలుసా? ఇవన్నీ తెలియాలంటే ఓసారి హుజురాబాద్ వైపు చూడాలి. ఇంక ఎన్నికల నగారా అయినా మోగనే లేదు.. అప్పుడే నియోజకవర్గాన్ని కమలనాథులు ఎలా కమ్మేశారో చూడండి.. ఒక్కో పట్టణం.. ఒక్కో మండలం.. ఒక్కో గ్రామం.. ఒక్కో బూత్.. ఇలా పక్కాగా ప్రణాళిక వేసుకుని.. హేమాహేమీల్లాంటి నేతలకు బాధ్యతలు అప్పగించి.. బీజేపీకి అత్యంత బలంగా ఉండే పోల్ మేనేజ్‌మెంట్‌ను ఈసారి హుజురాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే అంతా రెడీ.. ఇక కార్యచరణే ఆలస్యం.
బీజేపీకే ఈటల రాజేందర్‌తో అడ్వాంటేజ్.. బీజేపీతో ఈటలకు పెద్దగా ప్రయోజనం లేదనే వాదనలు పస లేనివని తాజా కార్యచరణతో తేలిపోతోంది. అన్ని పార్టీలు ఆహ్వానించినా.. ఈటల ఏరికోరి బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారో స్పష్టమవుతోంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో కమలనాథులు దిట్ట. అదే ఇప్పుడు ఈటలకు శ్రీరామ రక్ష. పకడ్బందీగా కాషాయ వ్యూహం సిద్ధమైపోయింది. భారీ కసరత్తుతో కమలదండు హుజురాబాద్ వైపు పయనమైంది. సేమ్ దుబ్బాక సీన్‌నే అక్కడా రిపీట్ చేయబోతున్నారు. సేమ్ దుబ్బాక ఫలితాన్నే హుజురాబాద్‌లోనూ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే, దుబ్బాక ఉప ఎన్నికకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన మాజీ టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డినే హుజురాబాద్ నియోజకవర్గానికీ ఇన్‌చార్జీగా నియమించారు. ఈ ఒక్క నిర్ణయం చాలదా దుబ్బాక రిపీట్స్ అని చెప్పడానికి.
ఇక, జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్ ఎంపీ అరవింద్‌ను నియమించారు. వెలమ సామాజిక వర్గం అధికంగా ఉండే జమ్మికుంట మండలానికి అదే వర్గానికి చెందిన.. హన్మకొండకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావును నియమించారు, హుజూరాబాద్ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్ మండలానికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. వీరి నేతృత్వంలో ఆయా మండలాల్లో ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఓటరును స్వయంగా కలవడం ద్వారా విజయం సాధించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సొంత జిల్లాతో పాటు ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నందున ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యం పెరిగింది. హుజురాబాద్‌లో విజయం సాధించడం ద్వారా బండి సంజయ్ తన సత్తాను బలంగా చాటుకోవాలని భావిస్తున్నారు. అందుకే, ఆయన హుజురాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ బూత్‌లు, 2,26,553 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్‌లవారీగా బీజేపీకి కమిటీలు ఉన్నాయి. నియోజకవర్గాన్ని మూడు పోలింగ్ బూత్‌లకు ఒక శక్తి కేంద్రంగా విభజించారు. మొత్తం 102 శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వీటికి ఇన్‌చార్జీలను, కమిటీలను నియమిస్తున్నారు. ఒక్కో బూత్ కమిటీలో పార్టీలోని అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తున్నారు. కమిటీకి 10 మంది సభ్యులకు తగ్గకుండా ఉంటారు. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల కమిటీలు ప్రతి ఓటరును కలిసి బీజేపీ గెలుపునకు కృషి చేయనున్నారు.
ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున 700 నుంచి 750 వరకు ఓటర్లు ఉండే అవకాశముంది. బూత్ కమిటీ సభ్యులు ఆ ఓటర్లను పంచుకొని ఒక్కో సభ్యుడు 50 నుంచి 60 మంది ఓటర్ల బాధ్యతను తీసుకొని నిత్యం వారిని కలుస్తూ పార్టీకి అనుకూలంగా మార్చడం, పోలింగ్ రోజు వారిని తీసుకెళ్లి ఓటు వేయించుకోవడంలాంటివి చేస్తారు. ఇలా, అధికార టీఆర్‌ఎస్ పార్టీని అడ్డుకోవడానికి పకడ్బందీ కార్యాచరణతో బీజేపీ ముందుకుపోతోంది. దీంతో.. హుజురాబాద్‌లో దుబ్బాక తరహా హోరాహోరీ సంగ్రామం తప్పకపోవచ్చు. కమలనాథులు చేస్తున్న పోల్ మేనేజ్‌మెంట్ చూస్తుంటే.. బీజేపీనే ఈటలకు అదనపు బలంగా మారిందని చెప్పక తప్పదు.