కేసీఆర్ ట్రాప్‌లో కాంగ్రెస్.. రేవంత్ వచ్చేదాక అంతేనా?
posted on Jun 26, 2021 @ 1:33PM
కేసీఆర్ పిలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖుషీఖుషీగా వెళ్లిపోయారు. కట్టినప్పటి నుంచీ ఎప్పుడూ చూడని ప్రగతి భవన్‌ను కళ్లారా చూద్దామనుకున్నారో.. లేక పేపర్లో ఫోటోలు పడతాయని ఆశపడ్డారో.. కారణం ఏంటో తెలీదు కానీ కేసీఆర్ పిలవడం.. కాంగ్రెస్ నేతలు ఎగేసుకొని వెళ్లడం.. అంతా పావుగంటలో జరిగిపోయింది. పిలవగానే అలా ఊపుకుంటూ వెళ్లిపోకుండా.. ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే బాగుండేదని అంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించినా కాస్త క్లారిటీ వచ్చేది. ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ ఇప్పుడే ఎందుకు పిలిచారు? ఏడేళ్లుగా తమను పరుగులను చూసినట్టు చూసిన కేసీఆర్‌కు సడెన్‌గా తామెందుకు గుర్తుకు వచ్చామని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది. తామెవరం డిమాండ్ చేయకముందే.. ముఖ్యమంత్రి జోక్యం కోరకముందే.. కేసీఆరే స్పందించి.. తమను పిలిపించి.. లాకప్‌డెత్‌లో చనిపోయిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడం అంతా కలలా జరిగిపోయిందని అంటున్నారు. కేసీఆర్ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ సీనియర్లు మరోసారి చిక్కుకుపోయారని.. మంచి అవకాశాన్ని చేజేతులారా చేజార్చకున్నారని అంటున్నారు.
పోలీస్ కస్టడీలో దళిత మహిళ లాకప్ డెత్. ఎంత పెద్ద విషయం ఇది. ఎంతటి దారుణ ఘటన ఇది. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఉద్యమించడానికి ప్రతిపక్షానికి మంచి అవకాశం దక్కేది. ఘటన తీవ్రత గుర్తించిన కేసీఆర్.. అది మరింత వివాదంగా మారకముందే.. కాంగ్రెస్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా పరిష్కారానికి ముందుకొచ్చారు. అప్పట్లో మంథనిలో ఇసుక దందాకు అడ్డొచ్చాడని దళితుడి సజీవ దహనం ఘటన.. ఇటీవల నడిరోడ్డు మీద మంథని లాయర్ దంపతుల దారుణ హత్య లాంటి ఉదంతాలు ఎంతో కలకలం రేపాయి. వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. అలాంటి సందర్భంలో కూడా స్పందించని సీఎం కేసీఆర్.. ఇప్పుడు సడెన్‌గా మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో ఆయనే స్వయంగా జోక్యం చేసుకొని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ పిలిపించుకొని వేడి చల్లార్చారు. కేసీఆర్ ఫోన్ చేయగానే.. హడావుడిగా ప్రగతిభవన్ వెళ్లి.. వాళ్లూ కొన్ని డిమాండ్లు చేసినట్టు.. వాటిని సీఎం కేసీఆర్ నెరవేర్చినట్టు చేసి.. ఫోటోలు దిగి.. సంబరంగా బయటకు వచ్చారు. వెళ్లొచ్చాక కానీ తెలీలేదు.. తాము కేసీఆర్ ట్రాప్‌లో పడ్డామని.. ఈ ఎపిసోడ్‌తో రాజకీయంగా అంతా కేసీఆర్‌కే లాభం జరిగిందని ఆలస్యంగా గుర్తించారు. అయినా, వారేమీ అవాక్కవలేదు.. .ఎందుకంటే, గతంలో అనేకసార్లు కేసీఆర్ చేతిలో అబాసుపాలైన చరిత్ర కాంగ్రెస్ నేతలది.
పెద్దలు జానారెడ్డి. కేసీఆర్ నోటినుంచి పదే పదే వచ్చే ఈ డైలాగ్.. తెలంగాణ తొలి అసెంబ్లీలో బాగా పాపులర్. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జానారెడ్డి ప్రయత్నించే ప్రతీ సందర్భంలోనూ.. పెద్దలు జానారెడ్డి అంటూ సీఎం కేసీఆర్ అడ్డుతగిలేవారు. కేసీఆర్ అంతటివాడే అసెంబ్లీ సాక్షిగా తనను పెద్దలు జానారెడ్డి అంటూ గౌరవిస్తుండటంతో ఆ మర్యాదకు ఆయన ఉబ్బితబ్బిబ్బు అయ్యేవారు. ఇక తాను ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విషయం పక్కనపెట్టేవారు. ఇదంతా తనపై ఉన్న గౌరవంతో కాదని.. పెద్దలు జానారెడ్డి అంటూ ఆయన్ను కేసీఆర్ బుట్టలో వేసుకునేవారనే విషయం పాపం జానారెడ్డికి ఇప్పటి వరకూ తెలీకపోవచ్చు అంటారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు సీఎం కేసీఆర్. ఇంకేముంది.. ఇక ప్రతిపక్షం ఏముంది? అలా తెలంగాణ తొలి అసెంబ్లీ టర్మ్‌ను ఈజీగా గట్టెక్కేశారు సీఎం కేసీఆర్. చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డి ఒక్కరే.. సభలో కేసీఆర్‌ను అటాడుకునేవారు. అందుకే, పంతం పట్టి మరీ ఆయన్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు కేసీఆర్. ఇక రెండో టర్మ్ అధికారం చేపట్టాక.. తెలంగాణ అసెంబ్లీలో అంతా ఏకపక్షమే. దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌పై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్నవాళ్లే. కాంగ్రెస్ తరఫున నోరున్న నేత లేకపోవడంతో.. ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీనే ప్రధాన విమర్శకుడిగా మారారు.
తాజాగా, రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారనగా మరోసారి కాంగ్రెస్ నేతలపై తన చాణక్యం ప్రదర్శించారు కేసీఆర్. ఏడేళ్లుగా గడప కూడా దాటనివ్వని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను.. ప్రగతి భవన్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఎందుకు పిలిచారో.. అసలు వెళ్లాలో లేదో.. అని ఆలోచించకుండా.. ప్రగతి భవన్‌లోకి వెళ్లి.. ముఖ్యమంత్రితో భేటీ అయి.. మళ్లీ కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారు కాంగ్రెస్ నేతలు. వారికిది కామనే అయినా.. చాలా రోజుల తర్వాత మరోసారి అలా జరగడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ మాయల మరాఠి అనే విషయం మరిచి... ప్రగతి భవన్ అనే మయసభలో అడుగుపెట్టి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆగమయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ తలరాతను ఎవరూ మార్చలేరని.. హస్తం పార్టీని వేరే ఎవరో ఓడించాల్సిన పనిలేదని.. వాళ్లకు వారే ఓడించుకుంటారనే నానుడి మరోసారి గుర్తు చేస్తున్నారు. పాపం.. కాంగ్రెస్ అంటున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీప్ అయ్యే వరకూ ఈ తిప్పలు తప్పవేమో....