మంత్రాలయం సెక్యూరిటీ సిబ్బంది కండకావరం.. వీడియో వైరల్
posted on Jul 24, 2021 @ 4:14PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం అంటే... అదో ఆధ్యాత్మిక కేంద్రం. కానీ అక్కడ భక్తులు మాత్రం అవమానాలు, ఛీత్కరింపులు, సెక్యూరిటీ సిబ్బంది నుంచి పాశవికమైన దాడులు ఎదుర్కోవాల్సిన దుస్థితి పట్టింది. తాజాగా ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఓ భక్తుణ్నిచితకబాదుతున్న వీడియో బయటపడింది. స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడిపై ఐదారు మంది సెక్యూరిటీ సిబ్బంది ఏకమై కర్రలు, పైపు, ప్లాస్టిక్ లాఠీ వంటివాటితో మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
కొట్టొద్దు, కొట్టొద్దు అంటూ ఆ భక్తుడు ప్రాధేయపడినా సెక్యూరిటీ సిబ్బంది కాసింతైనా కనికరం చూపలేదు. కర్ర దెబ్బలు భరించలేక బాధతో అరుస్తున్నా వారు మాత్రం దాడిని కొనసాగించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దర్శనానికి వస్తే దాడి చేస్తారా... నాపై దాడి చేసిన ఆ ముగ్గురి సంగతి చూస్తానంటూ బాధితుడు అక్కణ్నించి వెెళ్లిపోవడం కనిపించింది. అయినా కూడా సెక్యూరిటీ స్టాఫ్ వదలకుండా మళ్లీ కొట్టడం కూడా రికార్డయింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే... డబ్బులు ఇచ్చినవారిని మాత్రమే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారా అని ఆ భక్తుడు ఆడిగినందుకే వారు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ మాత్రం ప్రశ్నించినందుకే అంతా ఒక్కటై దాడి చేయడాన్ని నెటిజన్లు సైతం ఖండిస్తున్నారు. ఇప్పటికే హిందుత్వం అంటే ఇతర మతస్తులు చులకనగా చూస్తున్నారని, ఇందులోని వివక్షే అందుకు కారణమని, ఇకనైనా హిందూ సంస్థలు, మఠాలు, మత పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అయినా హిందూ సంస్థల తీరు మారడం లేదు. సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పిన హిందూమతంలో ఇలాంటి అపశ్రుతులు దొర్లినప్పుడు వాటిని సరిదిద్దే వ్యవస్థ మాత్రం లేకపోవడం బాధాకరమంటున్నారు. అయితే భక్తుల రాకతో ఆదాయం గానీ, అభివృద్ధి గానీ జరిగే దేవాలయాలు అసలు భక్తులతోనే అవమానకరంగా వ్యవహరిస్తే అప్రదిష్టపాలు కాక తప్పదన్న హెచ్చరికలు అనేక హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. మంత్రాలయంలో దాడికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించి, భక్తుల మనోభావాలకు పెద్దపీట వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.