జులై 26న అన్నీ తేలిపోతాయి.. జగన్‌పై రఘురామ సంచలనం...
posted on Jul 24, 2021 @ 3:52PM
జులై 26. తేదీ మామూలుదేనైనా.. ఉత్కంఠ మాత్రం మామూలుగా లేదు. జగన్ బెయిల్ రద్దు కేసులో ఆ రోజు సీబీఐ తీర్పు వస్తుందంటున్నారు. ఆ తీర్పు కచ్చితంగా జగన్‌కు వ్యతిరేకంగా ఉంటుందంటున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు అవడం ఖాయమంటున్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదంటున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అటు, పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ సైతం జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలిపోతాయంటూ జగన్‌ను మరింత టార్చర్ చేస్తున్నారు. ఎలాగైనా బెయిల్ రద్దు అవుతుందనే ధీమా రఘురామలో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు, రఘురామ ఎపిసోడ్ ఢిల్లీ స్థాయిలో కాక రేపుతోంది. నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనపై తమిళనాడులో నమోదైన కేసుకు సీఎం జగన్, బాలశౌరి కారణమన్నారు రఘురామ. తన గురించి అన్నీ తెలిసి పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
ఒకరు 16నెలలు జైల్లో ఉండి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారని.. మరొకరు ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని విషయాలు పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని తప్పుబట్టారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానన్నారు ఎంపీ రఘురామ.