ఆగస్టులోనే థర్డ్ వేవ్!.. ఈసారి మరింత డేంజరస్...!
posted on Jul 25, 2021 @ 1:07PM
కరోనా కేసులు భారీగా తగ్గాయి. కర్ఫ్యూ ఆంక్షలు పోయాయి. జనం రోడ్లపై విచ్చలవిడిగా తిరిగుతున్నారు. ఇన్నాళ్లూ ఆంక్షలతో కంట్రోల్లో ఉన్న ప్రజలు.. ఇప్పుడు ఒళ్లు విరుచుకుని విహారం చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు, షాపులు, పర్యటనలు, బంధువులు, పార్కులు, మాల్స్.. ఇలా అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక సాకుతో, పనితో బయటకు వస్తున్నారు. కరోనా పోయిందని బిందాస్‌గా ఉంటున్నారు. కానీ, కరోనా ఎక్కడికీ పోలేదట. ఇంకా మన మధ్యనే తిరుగుతోందట. ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్‌కు మధ్య బ్రేక్ ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు థర్డ్ వేవ్‌తో దాడి చేసేందుకు సిద్ధంగా ఉందట. అందుకు ఎంతో టైమ్ కూడా లేదని.. ఈ ఆగస్టులోనే థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మన దగ్గర రెండు వారాలుగా పాజిటివ్ కేసులు.. పాజిటివిటీ రేటు నిలకడగా ఉన్నాయి కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. భారత్‌లో మొదటి, రెండో దశలు.. తొలుత కేరళ తర్వాత మహారాష్ట్ర అనంతరం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలో ఇప్పుడు మరోసారి కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటం థర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు. కేరళలో పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ 9 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల నమోదులో కేరళ, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండటం ఆందోళనకర విషయం. థర్డ్ వేవ్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.
ఏపీలో రోజుకు సగటున 2వేల కేసులు వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 2.1 నుంచి 2.6 శాతం వరకూ ఉంది. తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. ఆయా జిల్లాల్లో కేసులు పెరుగుతాయి తప్ప.. తగ్గకపోవడంతో.. థర్డ్ వేవ్ ముందర ఏపీ ఉందని అంటున్నారు.
సుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. ఏ వారానికి ఆ వారం కర్ఫ్యూను పొడిగించుకుంటూ వస్తోంది. మూడోదశను దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ఫ్యూ అమలులో ఉన్న తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరుజిల్లాల్లో కేసుల ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా 67 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ ఉందని సీరో సర్వే ద్వారా వెల్లడవుతుంది. ఏపీలో కూడా దాదాపు 70శాతంపైన హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్లు సీరో సర్వేతో తేలింది. అయితే, రెండో దశ ఉధృతిని హెర్డ్ ఇమ్యూనిటీ నియంత్రించలేకపోయింది. మూడో దశ ప్రభావం తొలి రెండుదశల స్థాయిలో ఉండొచ్చని అంచనా. జాగ్రత్తగా లేకపోతే మరింత ప్రమాదకరం. వ్యాక్సినేషన్ ఎంత వేగంగా జరిగితే.. అంత ఉపయోగం.