కవితకు 6 నెలలు జైలు.. కేసీఆర్‌కు షాక్..
posted on Jul 24, 2021 @ 6:07PM
ఓటర్లకు డబ్బులు పంచడం.. చాలా పెద్ద నేరం. అయితే, ఈ విషయాన్ని నాయకులు ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎలక్షన్లు రాగానే.. నోట్లు వెదజల్లి ఓట్లు రాల్చుకుంటారు. ఐదేళ్లు ఏం పని చేయకపోయినా.. పోలింగ్‌కు ముందు రెండు రోజులు మాత్రం బాగా పని చేస్తారు. లక్ష్మీకటాక్షంతో ఓటర్ల జేబులు కళకళలాడుతుంటాయి. పోటీ ఎంత ఉంటే అంత ధర పలుకుతుంటుంది. ఓటుకు 500 నుంచి 5000 వరకూ పంచుతుంటారు. బయటకు మాత్రం తామేమీ ఖర్చు చేయలేదంటూ.. ఈసీ నిబంధనల మేరకే ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపుతారు. ఇలాంటి విషయాల్లో కేసులూ భారీగానే నమోదవుతుంటాయి కానీ, చాలా అరుదుగా మాత్రమే శిక్షలు పడుతుంటాయి.
తాజాగా, అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి ఓటుకు నోటు కేసులో శిక్ష పడింది. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్ పోలీసస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.