రాజీనామాలపై చంద్రబాబు సవాల్.. సర్కారు ఎస్కేప్.. అందుకే అంత భయమా?
posted on Jul 24, 2021 @ 10:17PM
అధికారంలో ఉన్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచారు. అయినా, టీడీపీ అంటే భయం. ఇంకా చంద్రబాబు అంటే వణుకు. కారణం, వైసీపీ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. అమరావతి, కరోనా కట్టడి నుంచి జాబ్ క్యాలెండర్ వరకూ రెండేళ్లుగా జనం.. జగన్‌పై ఎంత అసంతృప్తి, అసహనంతో ఉన్నారో పాలకులకు బాగా తెలుసు. కరోనా కేసులు తగ్గడంతో ధర్నాలు, నిరసనలు, ముట్టడిలతో ప్రజల నుంచి ఎగిసిపడుతున్న ఆగ్రహజ్వాలలే అందుకు నిదర్శనాలు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచారంటారా? ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు, అక్రమాలు, దొంగ ఓట్లతో గట్టెక్కారో ఏపీలో అందరికీ తెలిసిన విషయమే. అందుకే, రాజీనామాలంటే భయపడుతున్నారు. మళ్లీ ఎన్నికలంటే వణికిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే.. ఎలక్షన్లకు బెదరకుండా విశాఖ ఉక్కు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సిద్ధమా అని సవాల్ విసిరితే.. వైసీపీ మాత్రం రాజీనామాలకు ముఖం చేటేస్తోంది. సవాల్ స్వీకరించకుండా తప్పించుకుంటోంది.
ఇక ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటివాడైన సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. రాజీనామాల విషయంలో మరీ దిగజారి మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలనుకుంటే మీరే చేసుకోండంటూ పిరికితనం ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని సజ్జల మాట్లాడటం.. ఎన్నికలంటే వైసీపీలో కలుగుతున్న కలవరపాటుకు నిదర్శనం అంటున్నారు.
గతంలో అధికారంలో ఉండిమరీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో అలుపెరగని పోరాటం చేసిన.. ఎంపీలంతా రాజీనామ చేసిన ఘనత టీడీపీది. చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను తృణపాయంగా వదిలేశారు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు. అయితే, కేంద్రంతో అంటకాగుతూ.. ఢిల్లీకి గులాంగిరీ చేస్తూ.. ఏపీ ప్రయోజనాలను కాలరాస్తోంది వైసీపీ. బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉందంటూ.. మనమేమీ చేయలేమంటూ.. ప్రత్యేక హోదా నినాదాన్ని ఎప్పుడో అటకెక్కించేశారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంట్‌లో ఉత్తుత్తి నినాదాలు చేస్తున్నారు. పోలవరం నిధుల కోసం గట్టిగా నిలదీసింది లేదు. విశాఖ ఉక్కును అంగడి సరుకుగా అమ్ముకుంటున్నా.. ఉద్యమిస్తున్నది లేదు. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి.. జగన్ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదు. ఇంతటి చేతగాని, చేష్టలుడిగిన ప్రభుత్వాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదంటూ మండిపడుతున్నారు ప్రజలు. అయితే, జగన్ జుట్టు కేంద్రం చేతిలో ఉండటం.. సీబీఐ కేసుల ఉచ్చు బిగిస్తుండటమే.. ఢిల్లీకి జగన్ దాసోహమవడానికి కారణమనే విషయం అందరికీ తెలిసిందే. నేరం జగన్ చేస్తే.. శిక్ష ఏపీ అనుభవించాల్సి వస్తోందని ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.